మాస్కులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముంబైలోని సిద్ధి వినాయక ఆలయ పూజారులు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా ప్రకంపనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కర్నాటకలో బుధవారం కోవిడ్ –19 కి సంబంధించి తొలి మరణం నమోదు కాగా, శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో మరో మరణం సంభవించింది. కరోనా నిర్ధారణ అయిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో మరణించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆమె మధుమేహం(డయాబెటిస్), రక్తపోటు(బీపీ)తో బాధపడుతున్నారని, ఇటీవల ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆమె రామ్ మనోహర్ లోహియా(ఆర్‌ఎంఎల్) ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్, ఇటలీల్లో పర్యటించి వచ్చిన ఆమె కుమారుడికి కూడా కోవిడ్–19 నిర్ధారణ అయిందని వెల్లడించారు. అతడికి ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులను వేరుగా ఉంచి, పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
బికనీర్‌లో కొత్త జంటకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న దృశ్యం
దేశవ్యాప్తంగా హై అలర్ట్
కరోనా మరణాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నిరోధించే దిశగా చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఐటీ రాజధాని బెంగళూరు నగరం సహా కర్నాటక వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా థియేటర్లను, పబ్‌లు, నైట్ క్లబ్‌లను తక్షణమే మూసేయాలని ఆదేశించారు.
అన్ని రకాల ఎగ్జిబిషన్లు, సమ్మర్ క్యాంప్‌లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సదస్సులు, పుట్టినరోజు వేడుకలు, వివాహ కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలను శనివారం నుంచి వారం రోజుల పాటు నిలిపేయాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప శుక్రవారం రాష్ట్ర ప్రజలకు సూచించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను వారం పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదని ప్రజలకు సూచించారు.
స్కూళ్లను మూసేయాలని, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలతో పాటు సహా అన్ని పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా విధుల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయన్నారు. కోవిడ్‌తో కల్బుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే.
అతడు కాకుండా, రాష్ట్రంలో మరో ఐదుగురికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో, బెంగళూరులోని గూగుల్ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కూడా ఉన్నారు. కల్బుర్గిలో మరణించిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న 46 మందిని కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 82కి చేరింది. వీటిలో 11 యూపీలో, 7 ఢిల్లీలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసులు నిర్ధారణ అయ్యాయి.
సుధామూర్తి సూచనలు
కరోనా కట్టడికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నాటక ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్‌ను, సినిమా టాకీస్‌లను తక్షణమే మూసేసి, నిత్యావసరాలైన ఫార్మసీ, కిరాణా, పెట్రోల్ బంక్‌లను మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. బాధితుల కోసం ఒక ఆసుపత్రిని సిద్ధం చేయాలని, అందుకు తమ సహకారం అందిస్తామన్నారు.
ఇతర ముఖ్యాంశాలు..
► ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, శ్రీలంక దేశాలకు ఏప్రిల్ 30 వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్ని నిలిపివేసింది.
► ఉత్తరప్రదేశ్‌లో 11 కరోనా కేసులు నమోదు కావడంతో అన్ని పాఠశాలలు, కళాశాలల్ని మార్చి 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయి.
► ఢిల్లీలో మార్చి 31 వరకు జేఎన్‌యూ సహా అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ని బంద్ చేశారు. ఒడిశా కూడా అదే బాటలో నడుస్తోంది.
► కేరళలో చెంగాళంలో కరోనా వైరస్ సోకిన బాధితుడి పొరుగు ఇంట్లో నివసించే వృద్ధుడు మరణించడంతో కలకలం రేగింది. అతనికి కూడా కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానాలు వచ్చాయి. అయితే అతను గుండె పోటుతో మరణించాడని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 900 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటలీ నుంచి గత నెలలో కేరళకు వచ్చిన కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకిందని తేలడంతో ఆ రాష్ట్రం పలు చర్యలు తీసుకుంది.
► కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర కూడా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ముంబై, నవీముంబై, పుణె, థానె, నాగపూర్, పింప్రి చించ్వాడాలలో మార్చి 30 వరకు మాల్స్, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లను మూసివేశారు.
► వాఘా సరిహద్దుల ద్వారా విదేశీయులెవరినీ శుక్రవారం సాయంత్రం నుంచి దేశంలోకి అనుమతించడం లేదు.
► ఇటలీలో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మిలాన్‌కు వెళ్లింది. ఆదివారం ఉదయానికి భారతీయుల్ని వెనక్కి తీసుకురానుంది. మరోవైపు ఇరాన్ నుంచి రెండో విడత 44 మంది యాత్రికుల్ని వెనక్కి తీసుకువచ్చారు. ముంబై విమానాశ్రయంలో దిగిన వారిని జైసల్మీర్‌లో ఆర్మీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.
► ఏప్రిల్ 15వరకు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ప్రయాణికుల రాకపోకల్ని నిలిపివేశారు.
► సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఈ సోమవారం నుంచి అత్యవసర కేసులు తప్ప మిగిలినవేవీ విచారణ చేపట్టకూడదని నిర్ణయించింది. కోర్టు హాలులోకి లాయర్లను మినహా మరెవరినీ అనుమతించరు.
► ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 21 నుంచి రెండు రోజుల గుజరాత్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఇవీ నిత్యావసరాలే
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే ఫేస్ మాస్క్‌లు, గ్లవుజులు, హ్యాండ్ శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. వీటిని నిత్యావసర వస్తువుల చట్టం–1955 పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో, వీటి ఉత్పత్తి, నాణ్యత, సరఫరా, ధరలను నియంత్రించే అవకాశం రాష్ట్రాలకు లభిస్తుంది. జూన్ 30 వరకు అవి నిత్యావసరాల జాబితాలో ఉంటాయని, వాటిని అక్రమంగా పెద్ద ఎత్తున నిలవ చేయడం నేరమని కేంద్రం పేర్కొంది. వీటి ధరలను పెంచి అమ్మడం కూడా నేరమని పేర్కొంది. అవసరాలకు తగినంతగా వీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment