సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు.
ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్‌వర్క్, ఎకో సిస్టమ్‌ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు.
దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్‌రెడ్డి
కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్‌నెస్‌ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్‌లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు.
స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్
కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్‌పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment