ఆరు నెలలు పొడిగింపు
ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై నిర్ణయం
- నగదు రహిత చికిత్సతోపాటు డబ్బులిచ్చి వైద్యం చేయించుకునే వీలు
- నగదు రహిత వైద్యం గాడిలో పడే వరకు దీన్ని కొనసాగించే యోచన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువును మరో 6 నెలలపాటు పొడిగించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ నెలా ఖరుతో రీయింబర్స్ గడువు ముగుస్తున్నం దున ఈ నిర్ణయం తీసుకుంది. నగదు రహిత ఆరోగ్య కార్డుల కింద వైద్యం అంది స్తున్నా.. తాజాగా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చినా రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయకుండా మరో 6 నెలలపాటు కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. అన్ని కార్పొరేట్, ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత ఉచిత వైద్య సేవలు గాడిలో పడే వరకు.. వెల్‌నెస్ సెంటర్లు పూర్తి స్థాయిలో నెలకొల్పే వరకు వైద్యపరంగా ఉద్యోగులు ఇబ్బంది పడకుండా దీనిని కొనసాగించాల నేది సర్కారు ఉద్దేశం. అన్నీ సక్రమంగా కొనసాగితే 6 నెలల తర్వాత రీయింబర్స్ విధానాన్ని ఎత్తేసే అవకాశం ఉంది. రీయింబర్స్ కింద ఉద్యోగులు, వారి కుటుంబీకు లు తాము పొందిన వైద్యానికి ముందుగా డబ్బులు చెల్లించి ఆ తర్వాత బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటారు. నగదు రహిత సేవలకు ముందు ఉద్యోగులు ఈ పద్ధతి లోనే వైద్య సేవలు పొందేవారు.
నిమ్స్ ధరలకు 25% అదనంగా..
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, జర్నలి స్టులకు నగదు రహిత వైద్యం కింద అందించే శస్త్రచికిత్సల ప్రస్తుత ప్యాకేజీని 40% వర కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే అందులో వివిధ వ్యాధులకు వివిధ రకాలు గా ప్యాకేజీ ఖరారు చేశారు. మెడికల్ ప్యాకేజీలోని షుగర్ తదితర వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీని నిమ్స్ ధరలపై 25% అదనంగా పెంచారు. హెర్నియా, హైడ్రోసిల్ వంటి సాధారణ శస్త్రచికిత్సలకు కేంద్ర ఆరోగ్య పథకం(సీజీహెచ్) ప్రకారం ప్యాకేజీ నిర్ణయించారు. కిడ్నీలో రాళ్లు, ల్యాప్రోస్కోపిక్ వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సల ప్యాకేజీని 35 నుంచి 40% వరకు పెంచారు.
ఒకే వ్యక్తికి మూడు నాలుగు కలిపి జబ్బు లుంటే వాటికి ఒకే ప్యాకేజీ కింద చికిత్స ఇప్పటివరకు లేదు. షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు కలిసి కొందరికి ఉంటాయి. అలాంటి వారికి శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే నిమ్స్ మిలీనియం ధరల్లో 35% వరకు పెంచి ప్యాకేజీ ఖరారు చేస్తారు. మందుల ధరలను ఎంఆర్‌పీ ప్రకారం ప్యాకేజీ నిర్ధారించారు. వైద్య పరీక్షల ప్యాకేజీ నిమ్స్ టారిఫ్‌లో 25% అదనంగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా ప్రకటించిన 40% వరకు ప్యాకేజీ పెంపుతో రూ.100 కోట్ల వరకు ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రత్యేక కౌంటర్..
అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత వైద్య సేవలు 4 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా చేసుకోలేదని తెలిసింది. ఉద్యోగులు, జర్నలిస్టుల సేవలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకోవాల్సి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఉన్న ప్యాకేజీ సొమ్మును 40 శాతం వరకు పెంచినందున ఆ ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సి ఉందని అంటున్నారు. మొత్తం 1,885 వ్యాధులకు సంబంధించి వివిధ రేట్లను అందులో పొందుపరచాల్సి ఉంది. అంతేగాక ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు ఉన్నట్లుగానే ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఆ లోపు ఎవరైనా ఆస్పత్రికి వస్తే చికిత్స చేస్తామంటున్నారు.
వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించిన టీజీవో నేతలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఖైరతాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన వెల్‌నెస్ సెంటర్‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు మంగళవారం సందర్శించారు. టీజీవో రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు తదితరులు వెల్‌నెస్ సెంటర్‌లో సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం పాటుపడిన ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.