కల్తీ నెయ్యిని పరిశీలిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్
నెల్లూరు(సెంట్రల్): అధికారులు వరుస దాడులు జరుపుతూ.. కేసులు నమోదు చేస్తున్నా పలువురి తీరులో ఎలాంటి మార్పు రావడంలేదు. ఇష్టానుసారంగా నాణ్యత లేని కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయాలు సాగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆహార పదార్థాల్లో 80 శాతం వరకు కల్తీ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం తనిఖీలు చేస్తున్నా, కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. పాలు, నెయ్యినీ కల్తీ చేస్తుండటం గమనార్హం.
కఠినంగా చట్టాలు
ఆహార భద్రత ప్రమాణాల 2006 సెక్షన్ 37 చట్టం మేరకు కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే వారిని తనిఖీ చేసే పూర్తి బాధ్యతలను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. సెక్షన్ 41 ప్రకారం కల్తీ చేసే వారిపై కేసుల నమోదు, సీజ్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు చేయొచ్చు. 2011 నుంచి వివిధ శాఖలకు అనుబంధంగా ఉన్న ఫుడ్‌సేఫ్టీని విభజించి ఇతర శాఖలతో సంబంధం లేకుండా ప్రత్యేక ఫుడ్‌సేఫ్టీ విభాగంగా మార్చారు.
85 కేసుల నమోదు
ఇటీవలి కాలంలో జిల్లాలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి కల్తీ చేస్తున్న వారిని గుర్తించి 85 కేసులు నమోదు చేశారు. ఇందులో 75 కేసుల వరకు జాయింట్ కలెక్టర్ వద్దకు పంపారు. నిల్వ ఉన్న మాంసాహారం, నీటి ప్యాకెట్లు, నెయ్యి, తదితరాలపైనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. అధికారులు తనిఖీలు చేస్తున్నా, తయారీదారుల్లో ఎలాంటి మార్పు రావడంలేదు. సత్వరమే కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చూస్తే వీరిలో మార్పొచ్చే అవకాశం ఉంది.
కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు
జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికరంగా, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అనుమానం ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఆహార నిల్వలపై రోజూ తనిఖీలు చేస్తాం.– శ్రీనివాస్, ఫుడ్ సేఫ్టీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment