హోటళ్లు, బేకరీలపై విజి‘లెన్స్‌’ | Vigilance Attacks On Hotel PSR Nellore | Sakshi
Sakshi News home page

హోటళ్లు, బేకరీలపై విజి‘లెన్స్‌’

Published Fri, Nov 23 2018 12:58 PM | Last Updated on Fri, Nov 23 2018 12:58 PM

Vigilance Attacks On Hotel PSR Nellore - Sakshi

వివరాలు నమోదు చేస్తున్న అధికారులు

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు నగరంలో గురువారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు కలిసి హోటళ్లు, బేకరీలు, జ్యూస్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల ఎంఆర్‌పీ ఉల్లంఘన, అపరిశుభ్ర వాతావరణం, ఆహారంలో నాణ్యత లోపం, కాలం చెల్లిన వస్తువుల వినియోగాన్ని గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ కె.సి వెంకటయ్య ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు వి.సుధాకర్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసులు ఆర్టీసీ ఆవరణలోని ఓంసాయి హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. నాసిరకం ఆహార పదార్థాల విక్రయం, హోటల్‌ కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండడాన్ని గుర్తించారు. పెరుగు దుర్ఘందం వెదజల్లుతుండడంతో వాటి శాంపిల్స్‌ను సేకరించారు. హోటల్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

హోటల్‌ లీజ్‌ను రద్దు చేయాలని సూచించారు. పెరుగు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా హోటల్‌పై కేసు నమోదు చేస్తామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. అదే క్రమంలో బస్టాండ్‌ ఆవరణలోని ఓ ఫ్రూట్‌జ్యూస్‌ షాపులో తనిఖీలు చేశారు. ఎంఆర్‌పీ ఉల్లంఘన, కాలం చెల్లిన 10 మ్యాంగో జ్యూస్‌ ప్యాకెట్లను గుర్తించి వాటిని సీజ్‌ చేసి దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. బస్టాండ్‌ ఆవరణలోని పలు దుకాణాల్లో ఎంఆర్‌పీ ఉల్లంఘన, కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తున్నా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విజిలెన్స్‌ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. సాయంత్రం మాగుంట లేఅవుట్‌లోని జోష్‌ బేకరీలో విజిలెన్స్, ఫుడ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌ నాసిరకంగా ఉండడంతో ఐస్‌క్రీం శ్యాంపిల్స్‌ సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నారు. కాలం చెల్లిన ఆరు పాల ప్యాకెట్లు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

తీరు మారని హోటల్‌ నిర్వాహకుడు
ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలోని హోటల్‌పై ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ అధికారులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేసి అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అయినా నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికే అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండడం విజిలెన్స్‌ తనిఖీల్లో మరోమారు తేటతెల్లమైంది. కిచెన్‌లోని పలు ప్రాంతాల్లో పాచి పెద్దఎత్తున పేరుకుపోయి ఉండడం, పాత్రలు సరిగా శుభ్రం చేయకుండా ఉండడం, చెత్తాచెదారాలను అక్కడే వేసి ఉండడంతో ఈగలు ముసిరి  ఉండడాన్ని అధికారులు గుర్తించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అధికారులు ఏమేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement