సాక్షి, హైదరాబాద్ : పండ్లు, ఇతర ఆహార పదార్థాల కల్తీకి అడ్డుకట్ట వేయడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు విఫలమయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, దృఢ సంకల్పం లేకపోవడం వల్లే కల్తీ వ్యాపారులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించింది. పండ్లను, ఆహార పదార్థాలను భయం భయంగా తినాల్సిన పరిస్థితులు ఉన్నాయని.. ఏది కల్తీయో, ఏ పండును రసాయనాలతో మగ్గించారో.. ఏది తింటే ఏమవుతుందో తెలియడం లేదని పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే అందరం విషపూరిత ఆహారాన్ని తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. వ్యాపారులకు డబ్బు, లాభాపేక్షే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టడం లేదని.. వారిని కఠినంగా శిక్షించే యంత్రాంగమేదీ లేకపోవడమే దీనికి కారణమని పేర్కొంది.
ఆహార కల్తీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించాలని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి, తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు కల్తీ ద్వారా ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు విచ్చలవిడిగా కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజాప్రయోజ వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది.
ఈ కేసులో కోర్టు సహాయకారిగా (అమికస్ క్యూరీ) వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆహార కల్తీకి సంబంధించి అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని కోర్టుకు విన్నవించారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి కేవలం 48 మంది ఆహార తనిఖీ అధికారులు మాత్రమే ఉన్నారని.. అదే తమిళనాడులో ఏకంగా 521 మంది, చిన్న రాష్ట్రమైన గోవాలోనూ 24 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5న ఈ కేసు విచారణకు వచ్చిన తరువాతే.. అధికారులు మేల్కొని ఆయా మార్కెట్లలో తనిఖీలు చేశారని, ఈ ఏడాది చేపట్టిన మొదటి తనిఖీలు ఇవేనని కోర్టుకు తెలిపారు. ఇక ఆహార భద్రత చట్టం కింద అధికారుల నియామకాలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం వివరించారు. గత విచారణ సందర్భంగా ఏపీలో 622 మంది అధికారులను నియమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కోర్టుకు చెప్పారని... కానీ తాత్కాలిక పద్ధతిలో 29 మందిని మాత్రమే నియమించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
నెలకు మూడు తనిఖీలేనా..?
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. అధికారులు నెలకు మూడే తనిఖీలు చేసినట్లు అర్థమవుతోందంటూ.. తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉండాలని స్పష్టం చేసింది. కార్బైడ్ ఉపయోగించిన పండ్లను తింటే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదుల వివరణను ధర్మాసనం తప్పుబట్టింది. ‘‘అవగాహన కల్పించడం సమస్యకు పరిష్కారం కాదు. అసలు మనం కొనే పండు కార్బైడ్ వాడి మగ్గబెట్టిందా? కార్బైడ్ వాడనిదా? అన్న విషయం ఎలా తెలియాలి? ఎలా గుర్తించాలి? ఇందుకు ఓ విధానం ఉంటే తప్ప ప్రయోజనం ఉండదు..’’అని స్పష్టం చేసింది. అసలు ఇప్పటివరకు ఎంత మంది కల్తీ వ్యాపారులను జైలుకు పంపారంటూ.. కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎప్పటికి మారుతుందని నిలదీసింది.
Comments
Please login to add a commentAdd a comment