సాక్షి, బీబీపేట(నిజామాబాద్) : రంగు రంగుల ప్యాకెట్లలో ఆకట్టుకునే తినుబండారాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. విషతుల్యమైన రసాయనాలతో తయారు చేసిన ఆయా ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాంటి అనుమతి లేకుండా రకరకాల పేర్లతో కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో విరివిగా హోల్‌సేల్ షాపుల్లో తినుబండారాల ప్యాకెట్లను జోరుగా విక్రయిస్తున్నారు.
ప్రతీ రోజు రూ.వేలల్లో వ్యాపారం
పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఈ ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.వేలల్లో వ్యాపారం కొనసాగుతోంది. నాసిరకమైన ఉత్పత్తులను నగరాల నుంచి దిగుమతి చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాల వరకు సైతం కల్తీ ఆహార పదార్థాల రంగు రంగుల ప్యాకెట్లు విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలల ఎదుట ఏర్పాటు చేసిన చిల్లర దుకాణాల్లో కేవలం ఒకటి రెండు రూపాయలకే ఆయా ప్యాకెట్లు లభిస్తున్నాయి. మార్కెట్లో బ్రాండ్ కంపెనీలను తలపించేలా రంగురంగుల బొమ్మలతో ప్యాకింగ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తినుబండారాలకు రంగులు, చాట్ మాసాలా వేసి రంగులు రుచిని జోడిస్తున్నారు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తింటున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.
పట్టించుకోని ఆరోగ్యశాఖ..
కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా జరుగుతున్నా సంబంధిత ఆహార కల్తీ నియంత్రణ, ఆరోగ్యశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోడంతో చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మారుమూల గ్రామాలకు సంబంధిత అధికారులు రాకపోవడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో ఏ షాపులో చూసినా రంగురంగుల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఒకటి ఆరా తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇక, పల్లెల వైపు అయితే కన్నెత్తి చూడడం లేదు. దీంతో గ్రామాలల్లోకి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి.
ఆరోగ్యానికి హానికరం..
మార్కెట్లో లభించే తినుబండారాలు చిన్నారులకు ఎంతో హాని కలిగిస్తున్నాయి. రంగు రంగుల ప్యాకింగ్‌లతో చిన్నారులను ఆకర్షించేలా ప్యాకెట్లు రూపొందించి వ్యాపారులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాసిరకం వస్తువులతో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తుండడంతో ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల చిన్నారులకు రకరాకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం..
కల్తీ తినుబండారాలు తినడంతో ఆకలి సరిగా కాకపోవడం, కడుపులో నట్టలు తయారు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. రంగు రంగుల ప్యాకెట్లతో ఆకర్షించే కల్తీ పదార్థాలను కొనివ్వకూడదు. పిల్లలకు పోషక ఆహారాలను అందించాలి.
– డా.ప్రవీణ్‌కుమార్, బీబీపేట
Comments
Please login to add a commentAdd a comment