![Food Safety on Wheels aims to prevent food adulteration - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/10/5/food.jpg.webp?itok=G_Nu2KbN)
సాక్షి, అమరావతి: ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఆహార కల్తీని సులభంగా గుర్తించేలా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరిట ల్యాబ్‌తో కూడిన మొబైల్ వాహనాలు త్వరలో రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిద్వారా ఆహార కల్తీని అప్పటికప్పుడే కనిపెట్టే సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. రెండు దశల్లో 14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలి దశలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం రీజియన్‌లకు ఒక్కొక్కటి, స్టాండ్ బై కింద ఒక వాహనం చొప్పున మొత్తం నాలుగు కొనుగోలు చేస్తున్నారు.
ఇక రెండో దశలో 10 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. రెండు దశల్లో 14 వాహనాలు అందుబాటులోకి వచ్చాక ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన పాత జిల్లా కేంద్రంలో ఒక్కొక్క వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఒక్కో వాహనం కొనుగోలుకు రూ.45 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. తొలి దశలో 4 వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) టెండర్లు ఆహా్వనించింది.
ప్రతి వాహనంలో 80 రకాల పరీక్షలు
మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనంలో 80 రకాల పరీక్షలు చేసే సౌకర్యం ఉంటుంది. పాల కల్తీని నివారించడానికి యూరియా, డిటర్జెంట్, ఇతర రసాయనాలను కలిపారా? లేదంటే పాలల్లో కొవ్వు, సాలిడ్ నాట్ ఫ్యాట్ (ఘన పదార్థాలు) స్థాయిలను తెలుసుకోవడానికి మిల్క్ అనలైజర్ అందుబాటులో ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారేమో తెలుసుకోవడానికి టీపీసీ, ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఆనవాళ్లు పసిగట్టడానికి, ఉప్పులో అయోడిన్ వంటి పరీక్షలు చేయడానికి మ్యాజిక్ బాక్స్, టిష్యూపేపర్ టెస్ట్‌లు మొబైల్ ల్యాబ్‌లో నిర్వహించవచ్చు.
డిజిటల్ మల్టీ పారామీటర్, హ్యాండ్ మిల్లీమీటర్ (పీహెచ్ కండెక్టివిటీ, టీడీఎస్, టెంపరేచర్), డిజిటల్ రీ ఫ్యాక్టో మీటర్, డిజిటల్ బ్యాలెన్స్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్క్ స్క్రీనింగ్ తదితర పరికరాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి ఘటనల్లో నీటిలో బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించడానికి శాంపిళ్లను నిర్ధేశిత టెంపరేచర్‌లో భద్రపరిచి సెంట్రల్ ల్యాబ్‌కు తరలించడానికి వీలుంటుంది.
కల్తీ నియంత్రణ చర్యల్లో భాగంగా..
ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. కల్తీని తక్షణమే పసిగట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానంలో శాంపిళ్లు సేకరించి ల్యాబ్స్‌కు పంపి పరీక్షించి ఫలితాలు రావడానికి సమయం పడుతోంది. ఈ కాలయాపనకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌తో చెక్ పడుతుంది. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్, డయేరియా కేసులు నమోదైనప్పుడు సత్వరమే స్పందించడానికి మొబైల్ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. – జె.నివాస్, కమిషనర్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ
Comments
Please login to add a commentAdd a comment