రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం! | Farmers income will double! | Sakshi
Sakshi News home page

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం!

Published Mon, Dec 18 2017 1:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers income will double! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న కేంద్రం ఇందుకోసం అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ భాగస్వామ్యం అవసరమని గుర్తించింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్‌ గ్రాండ్‌ చాలెంజ్‌ను ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో 12 కీలక అంశాల్లో రైతులు ఎదుర్కొనే వివిధ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలని ఔత్సాహికులు, స్టార్టప్స్‌ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగాన్ని లాభాలబాట పట్టించేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అలా ముందుకు వచ్చే స్టార్టప్స్‌కు అవసరమైన ఆర్థికసాయం అందించేందుకు కూడా సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి వసతి  లేకపోవడం, పెట్టుబడులు పెట్టే స్థితి లేకపోవడం వంటి కారణాలు రైతును అప్పులబాట పట్టిస్తున్నాయి. ఇదేకాక సాగు ఖర్చు పెరగడం, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం, ఫలితంగా ఉత్పాదకత పెరగకపోవడం తదితర కారణాలతో పంట గిట్టుబాటయ్యే పరిస్థితులు కొరవడ్డాయి. ఈ నేపథ్యంలో 12 కీలక అంశాల్లో వినూత్న ఆలోచనలు చేసి రైతులకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. 

12 కీలక అంశాలేంటంటే?
- భూసార పరీక్షలను మరింత సరళీకృతం చేయడం. ఇష్టారాజ్యంగా ఎరువులు, పురుగు మందులు చల్లుతుండటంతో సాగు ఖర్చు భారీగా పెరుగుతోంది. సాగు ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలు జరగాలి. అప్పుడే ఎంతమేర ఎరువులు అవసరమో తెలుస్తుంది. 
- ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ–నామ్‌)లో లోపాలను సరిదిద్ది రైతుకు మరింత ప్రయోజనకారిగా మార్చాలి. దీనివల్ల రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. 
- ఈ–నామ్‌కు అనుగుణంగా ఈ–మార్కెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని కేంద్రం భావిస్తోంది. అందుకు స్టార్టప్స్‌ కృషిచేయాలని కోరుతోంది. 
- పంట సాగు సమయంలోనే ధరను అంచనా వేయడం. సాగు చేసే సమయంలో ఒక్కోసారి పంట ధర అధికంగా ఉంటోంది. పంట చేతికొచ్చాక మార్కెట్లోకి అడుగిడే సరికి ధర పతనమవుతోంది. ఇది రైతును నిలువునా ముంచుతోంది. ఒక ఏడాది ధర అధికంగా ఉంటే, మరోసారి తక్కువగా ఉంటుంది. దీనికి కారణాలను సాగు సమయంలోనే అంచనా వేసే పరిస్థితి ఉంటే రైతు నష్టపోడు. ఈ నేపథ్యంలో సాగు సమయంలోనే ధరను అంచనా వేసేలా స్టార్టప్స్‌ ముందుకు రావాలని కేంద్రం కోరింది. 
- కేంద్ర రాష్ట్రాలు అనేక వ్యవసాయ పథకాలను అమలుచేస్తున్నాయి. కానీ ఆయా పథకాల వివరాలు రైతుకు పూర్తిస్థాయిలో చేరడంలేదు. దీంతో రైతు నష్టపోతున్నాడు. పథకాలను రైతులకు ఎప్పటికప్పుడు చేరవేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు స్టార్టప్స్‌ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. 
- ఉత్పాదకతను అంచనా వేయడంలో ఇప్పటికీ అశాస్త్రీయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. పంట కోత ప్రయోగాలంటూ నెలల తరబడి చేస్తున్నారు. దీనివల్ల రైతుకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందడంలేదు. పంట ఉత్పాదకతను అంచనా వేసేలా శాటిలైట్‌ ఆధారిత వ్యవసాయ–వాతావరణ కొలమానాలు అవసరం. ఇందులో అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. 
- రైతు ఆదాయం పెరగడం.. పంటల నష్టాలను అరికట్టడం కోసం వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముంది. అందుకోసం శాస్త్ర పరిజ్ఞానం కీలకం కావాలి. ఇందులోనూ స్టార్టప్స్‌ వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి. 
- ఆహార కల్తీ వల్ల వినియోగదారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కల్తీని అరికట్టడానికి వినూత్న పరిజ్ఞానాన్ని తీసుకురావాలి. హా కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాలు, ఇన్‌పుట్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, అవసరమైన ఎరువులు, పురుగుమందుల ఎంపిక అంతా ఇక్కడే జరిగేలా ఈ కేంద్రాలను వినూత్నంగా తీర్చిదిద్దాలి. హా గడ్డి తగలబెట్టడాన్ని నిరోధించాలి. దాన్ని ప్రత్యామ్నాయ అవసరాలకు ఎలా ఉపయోగించాలన్న పరిజ్ఞానాన్ని కనుగొ నాలి. హా ప్రమాదకరమైన పురుగు మందు లు, కీటక నాశినిలతో రైతులకు, పంటలకు  నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పంట కోతకు ముందు, తర్వాత జరిగే నష్టాలను నివారించాలి. హా పంటల ఉత్పాదకత పెంచే చర్యలపై స్టార్టప్స్‌ దృష్టిసారించాలి. తక్కువ ఖర్చు,  సులువైన పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. తద్వారా పంటల ఉత్పాదకతను పెంచాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement