ఒకే ఒక్కడు..! | Shortage of Employees in The Food Inspector Office | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు..!

Published Fri, Mar 2 2018 4:29 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

Shortage of Employees in The Food Inspector Office - Sakshi

గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం

నల్లగొండ టూటౌన్‌ : మార్కెట్‌లో  రోజురోజుకూ ఆహార పదార్థాల కల్తీ రాజ్యమేలుతోంది.  ప్రతిదాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నా తనిఖీలు చేసి పట్టుకొనే వారు లేకపోవడం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం ఉన్నా అక్కడ ఉద్యోగుల కొరత ఉండడంతో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా  సాగుతోంది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టాల్సిన శాఖలో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నల్లగొండలో ఉన్న కార్యాలయంలో కేవలం ఒక గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాత్రమే ఉన్నారు. ఆయనకు ఖమ్మంలో అదనపు బాధ్యతలు అప్పగించారు. దాంతో అక్కడ మూడు రోజులు, ఇక్కడ మూడు రోజులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక్కడ పని చేసే మూడు రోజులు కోర్టుల్లో ఉన్న కేసుల చుట్టూ తిరగడానికి సమయం సరిపోతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా యాదాద్రిభవనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉన్నా అక్కడ గెజిటెడ్‌ స్థాయి అధికారి లేకపోవడంతో ఆ జిల్లాల్లో కూడా ఈయనే పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

కల్తీలపై చర్యలేవీ?
జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా కల్తీ జరిగితే ఫిర్యాదు చేయడానికి కార్యాలయంలో దరఖాస్తులు తీసుకునే బాధ్యత గల ఉద్యోగి లేకపోవడం గమనార్హం. కార్యాలయంలో కేవలం ఒక మహిళా అటెండర్, ఒక పార్ట్‌ టైం ఉద్యోగి మాత్రమే ఉన్నారు. కల్తీల గురించి సమాచారం ఇవ్వాలన్నా, వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా అక్కడ ఏ ఒక్క ఉద్యోగికి విషయ పరిజ్ఞానం లేదు. గెజిటెడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కడే అన్ని విధులు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని  పలు ప్రాంతాల్లో గుట్కా అమ్మకాలు, ఆయిల్‌ మిల్లుల్లో కల్తీ అమ్మకాలు జరుగుతున్నా వాటి గురించి పట్టించుకునే వారే లేరని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆయిల్‌ మిల్లుల్లో గత ఏడాది తనిఖీలు చేసినా నేటికి వాటిపై చర్య తీసుకోకపోవడం చూస్తే  ఆహార కల్తీ నియంత్రణ శాఖ పని తీరు ఎలా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. 

కొరవడిన నిఘా..
జిల్లాలో కల్తీ మాయాజాలం జోరుగా సాగుతున్నా వాటిపై నిఘా లేకపోవడం వ్యాపారులకు ఎంచక్కా కలిసి వస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారుల తనిఖీలు లేక కల్తీలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద, పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, పాలు, ఆయిల్‌ మిల్లులు, బ్రెడ్‌ కంపెనీల్లో కల్తీ ఎక్కువగా జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఉన్నతాధికారులు స్పందించి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి జిల్లాలో కల్తీ వ్యాపారాన్ని నియంత్రించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.


కల్తీ చేస్తే చర్యలు తప్పవు
ఆహార పదార్థాలను కల్తీ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కల్తీలపై ఫిర్యాదులు చేస్తే కార్యాలయంలో పార్ట్‌టైం ఉద్యోగి స్వీకరిస్తారు. నేను నల్లగొండతో పాటు ఖమ్మంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 
– ఖలీల్, జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement