పసుపు..కారం..కాదేదీ కల్తీకనర్హం! | Food Items adulterated in Hyderabad | Sakshi
Sakshi News home page

సర్వం కల్తీమయం!

Published Wed, Dec 4 2019 10:18 AM | Last Updated on Wed, Dec 4 2019 10:18 AM

Food Items adulterated in Hyderabad - Sakshi

పసుపు..కారం..కాదేదీ కల్తీకనర్హం!

సాక్షి సిటీబ్యూరో:  యూరియాతో పాలు, ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి..ఇటుక పొడితో కారం..బట్టల సోడాతో చక్కెర..మోటానిల్‌తో పసుపు పౌడర్, జంతువుల కొవ్వుతో వంట నూనె..నాసిరకం వస్తువులతో అల్లం వెల్లుల్లి పేస్ట్‌...డూప్లికేట్‌ ఇంజిన్‌ ఆయిల్స్‌...ఇలా సిటీలో సర్వం కల్తీ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని అక్రమార్కులు కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి మార్కెట్‌లోకి జొప్పిస్తున్నారు. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరినీ అనుమతించకుండా..నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యధేచ్చగా నడుస్తున్నాయి.

దాదాపు సరుకులన్నీ...
చిన్న పిల్లకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నూనె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువులు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్‌ వస్తువులు సైతం డూప్లికేట్‌ అవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకిలీవి తయారవుతున్నాయి. 

నగర శివారు నుంచే...
నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుతోంది. రాచకొండ, సైబరాబాద్‌ ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీ షరీఫ్, జల్‌పల్లి, షాహీన్‌ నగర్, బాలాపూర్‌ శివారు, శ్రీరాంనగర్‌ కాలనీ, మీర్‌పేట్, నాదర్‌గూల్, బడంగ్‌పేట్, కందుకూర్, మామిడిపల్లి, హయాత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, ఆదిభట్ల, ఘట్‌కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్‌ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్‌ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. . ఇక్కడ రూ.50 విక్రయించే వస్తువును పది రూపాయలకే తయారుచేస్తున్నారు. డూప్లికేట్‌ ప్యాకింగ్‌తో లారీల ద్వారా బస్తీలు, కాలనీలు, గ్రామాలకు తరలిస్తున్నారు. చిన్నా చితక కిరాణా షాపులకు తక్కువకే విక్రయిస్తున్నారు.

వ్యాపారులకూ పాత్ర 

కొందరు వ్యాపారులు సైతం కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్‌ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. కల్తీ మాఫియా సంబంధిత అధికారులనే మేనేజ్‌ చేసుకొని తమ దందాను కొనసాగించడానికి నగర శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. నిత్యవసర వస్తువుల తయారీ పేరుతో పరిశ్రమలు ఏర్పాటు చేసి దాని మాటున  నకలీ వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.  కాగా కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఫుడ్స్‌ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం..కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్‌ చేయించుకోవడం.. ఇక పై దందా షురూ! ఓ భారీ షెడ్‌.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్‌ చేసుకొవడం...ఇలా కల్తీ వ్యాపారం మూడు పొట్లాలు ఆరు ప్యాకెట్‌లుగా కొనసాగుతుంది.

ఏటేటా పెరుగుతున్నా...
కల్తీ ఆహార పదార్థాల కేసులు ప్రపంచంలో ఏటా లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కల్తీ పదార్థాలు తినడం వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది మర ణిస్తున్నారని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. 2011–12లో 13 శాతం ఉన్న కల్తీ వ్యాపారం 2018–19 నాటికి 26 శాతానికి పెరిగింది. దీనికి కారణం అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ లోపించడమే. కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా,యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది.  కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. పోలీసులు దాడులు పెరగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement