‘నాలుగో సింహం’ అవినీతి గర్జన!
- కొండపై ఏఆర్ సిబ్బందికి డ్యూటీలు
- లడ్డూలు..గదుల బుకింగ్‌లో చేతివాటం
- 78 రోజులుగా సిబ్బందికి తప్పుడు హాజరు
- చిత్తూరు ఏఆర్‌లో అధికారుల నిర్వాకం
చిత్తూరు: జిల్లాలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగంలో తవ్వేకొద్దీ ఇక్కడున్న కొందరు అధికారుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఎస్కార్ట్ డ్యూటీల్లో చేతివాటం ప్రదర్శించిన కొందరు అధికారులు, సిబ్బందిని సైతం తప్పుడు దారుల్లోకి పంపుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇందుకు సాక్షాత్తు తిరుమలేశుని సన్నిధినే లక్ష్యంగా ఎంచుకున్నారు.
‘‘ఇటీవల సిబ్బందికి హాజరు వేస్తున్న డ్యూటీ ఆర్‌ఎస్‌ఐ దామోదర్‌రెడ్డి రాకపోవడంతో గైర్హాజరు వేశారు. అయితే చిత్తూరు ఏఆర్‌లోని 12వ ప్లటూన్‌కు చెందిన ఇ.దామోదర్‌రెడ్డి (పీసీ–1810) దీనిపై డ్యూటీ ఆర్‌ఎస్‌ఐకు పిటిషన్ లెటర్ రాశాడు. ఈ ఏడాది మే 15 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ, ఆర్‌ఐల ఉత్తర్వుల మేరకు తిరుమలలో గదులు, లడ్లు ఇప్పించే డ్యూటీ చేస్తున్నానని, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు హాజరు వేయాలని ఈనెల 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు లెటర్ రాసిచ్చాడు.’’
‘‘అయితే అదే రోజు ఏఆర్ ఆర్‌ఐకు సైతం దామోదర్‌రెడ్డి తనను డ్యూటీకు తీసుకోవాలని మరో లెటర్ రాశాడు. గత నెల 27 నుంచి ఈనెల 2వ తేదీ వరకు అత్యవసర సెలవుపై వెళ్లానని..3వ తేదీ కూడా ఆరోగ్యం సరిగా లేక అదనంగా ఓ రోజు సెలవు తీసుకుంటానని పేర్కొన్నాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆర్‌ఐ.. దామోదర్‌రెడ్డిను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఐను ఆదేశించాడు.’’
ఇదీ మతలబు
మొదటి పిటిషన్‌లో తాను తిరుమల కొండపై ఉన్నతాధికారుల ఆదేశాలతోనే 78 రోజులుగా విధులు చేస్తున్నట్లు దామోదర్‌రెడ్డి స్వయంగా అంగీకరించాడు. అయితే ఈ విషయం డ్యూటీ ఆర్‌ఎస్‌ఐకు తెలిసిపోయింది. స్టాఫ్ హాజరు రిజిస్టర్‌లో దామోదర్‌రెడ్డి ప్రతీ రోజూ విధులకు హాజరవుతున్నట్లు ఉన్నతాధికారులు చూపించారు. ఒక్కోసారి ఇతన్ని లోకల్ ప్రిజనర్ ఎస్కార్ట్ (ఎల్‌పీఈ) డ్యూటీ కింద తిరుపతి పంపినట్లు రిజిస్టర్‌లో పేర్కొన్నారు. కానీ వాస్తవానికైతే దామోదర్‌రెడ్డి కొండపై శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇది అధికారికమా? అనధికారికమా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. అధికారికంగా అయితే హాజరు రిజిస్టర్‌లో ఆన్‌డ్యూటీ చూపుతూ కొండపై ఉన్నట్లు రాయాలి. కానీ ఎక్కడా ఈ విషయాన్ని రాయలేదు. ఇక ఎస్కార్ట్ డ్యూటీకి పంపితే బెల్ ఆఫ్ ఆర్మ్ పుస్తకంలో ఆయుధాలు తీసుకున్నట్లు రాయాలి. ఇతను ఎక్కడా ఆయుధాలు తీసుకోలేదు. అలాగే జనరల్ డ్యూటీ పుస్తకంలో 78 రోజుల పాటు ఎక్కడ విధులు చేశాడో రాయాలి. ఆ వివరాలు కూడా జీడీలో లేవు.
ఎందరికి వాటాలో..?
తిరుమల కొండపై పరపతితో గదులు, లడ్డూలు తీసుకుని బ్లాక్ వ్యాపారం చేయడంలో చిత్తూరు ఏఆర్ విభాగానికి చెందిన కొందరు అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. తాజాగా దామోదర్‌రెడ్డి రాసిచ్చిన పిటిషన్లు ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోజూ గదులు, శ్రీవారి ప్రసాదాలను బ్లాక్‌లో విక్రయించి వచ్చిన ఆ మొత్తాన్ని చిత్తూరులోని అధికారులకు పంపగా.. ఇక్కడున్న కొందరు వాటాలు వేసుకుంటున్నట్లు సాటివారే విమర్శిస్తున్నారు.
ఇటీవల కొండపై విజిలెన్స్ విభాగం ఈ విషయాన్ని గుర్తించడంతో సీఎల్ రిజిస్టర్‌లో దామోదర్‌రెడ్డికి ఆరు రోజుల అత్యవసర సెలవు ఇచ్చినట్లు.. రిజిస్టర్‌లో దిద్దుబాట్లు వేసి ఆర్‌ఐ సంతకం పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎస్పీ రాజశేఖర్‌బాబు మరింత లోతుగా విచారణ చేయిస్తే అక్రమార్కుల అసలు రూపం బయటపడనుంది.