మెప్మా ..ఇదేంటి చెప్మా.. | MEPMA Harassments On Woman In Chittoor | Sakshi
Sakshi News home page

మెప్మా ..ఇదేంటి చెప్మా..

Published Sun, Aug 26 2018 11:36 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

MEPMA Harassments On Woman In Chittoor - Sakshi

తిరుపతి తుడా: అవినీతి, అక్రమాలతో ఇప్పటికే అభాసుపాలైన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో వేధింపులకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. అక్క డి అవినీతి జాడ్యాన్ని భరించలేని ఓ మ హిళ ప్రభుత్వం నుంచి మెప్మాకు అందుతున్న నిధులు, జమా ఖర్చు వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగింది. దీంతో ఆ మహిళకు  అధికారుల నుంచే కాకుండా అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో 4200 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 43 వేల మంది సభ్యులుగా ఉన్నారు. మీనాక్షి సమాఖ్యలో కొర్లగుంట చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన హేమలత  సభ్యురాలు. గతంలో ఆర్పీగా పనిచేసేది. అనివార్య కారణాలతో ఏడాది క్రితం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. మెప్మా అధికారుల అక్రమాలు, అవినీతిని భరించలేక బయటపడినట్లు సన్నిహితుల వద్ద ఆవేదనవ్యక్తం చేసేది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి నిధులు అందుతున్నాయి, ఖర్చుల వివరాల కోసం హేమలత భర్త ఆర్టీఏకు దరఖాస్తు చేశారు. ఫలితంగా ఆమెకు.. కుటుంబానికి వేధింపులు మొదలయ్యాయి.

గుట్టు బయటపడుతుందనే..
హేమలత అడిగిన వివరాలను చూసిన అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. సమాచారం బయటకు పొక్కితే మెప్మా గుట్టు బయటపడుతుందని అధికారులు తిరుపతిలోని అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ వివరాలు ఎందుకంటూ అధికార పార్టీలో కీలక నాయకుడొకరు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన చెందుతోంది. పలుకుబడి, పరిచయాలతో మిగిలిన మూడు టీఎల్‌ఎఫ్‌లో పనిచేస్తున్న కొంతమంది సభ్యుల ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది.  అండగా నిలవాల్సిన తోటి సభ్యులు, అధికార పార్టీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీఏ కింద సమాచారం ఇవ్వకుండా మూడు నెలలుగా కాలయాపన జరుగుతోంది. వేధింపులు పరాకాష్టకు చేరడంతో ఆ మహిళ శనివారం ఈస్టు పోలీసులను ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన మెప్మా..
మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బంధువు ద్వారా పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆర్టీఏ కింద ఆమె అడిగిన సమాచారం ఇస్తే అవినీతి, అక్రమాలు బయటపడతాయని, తమతో పాటు సంఘాల లీడర్ల అవినీతి బాగోతం బయటపడుతుందని మహిళా సంఘాల సభ్యులను రెచ్చగొట్టి ఆమెపైకి ఉసిగొల్పుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు మెప్మా కార్యాలయానికి వస్తే చర్చించుకోవచ్చని పీడీ  కోరినట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement