mepma office
-
మెప్మాలో ధనికులదే పెత్తనం
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పేదలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పించి పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్మాలో ఉద్యోగుల భార్యలు, ధనికులు పెత్తనం చెలాయిస్తున్నారు. గిద్దలూరులోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో సగానికిపైగా ఆర్పీలు ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారే కొనసాగుతున్నారు. దీంతో పట్టణంలోని పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పేదరికంలో ఉన్న ఆర్పీలను తొలగించి ధనికుల వద్ద నగదు తీసుకుని ఆర్పీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా మెప్మాలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తున్న మెప్మా అధికారులు గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి పట్టనట్లు వ్యవహరిస్తూ వారి విధులను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. నగర పంచాయతీ కమిషనర్ పర్యవేక్షించాల్సి ఉన్నా అటువైపు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మెప్మాలో టీడీపీకి అనుబంధంగా ఏర్పడిన ఆర్పీల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మెప్మాలో నాలుగు సంవత్సరాల పాటు ఆర్పీగా పనిచేసిన పి.అంజనీదేవిని నిర్దాక్షిణ్యంగా తొలగించి నగదు ఇచ్చిన వారిని ఆర్పీగా నియమించుకున్నట్లు సమాచారం. ఆర్పీలుగా ఎవరిని నియమించాలి..? పట్టణంలో పేద మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 15 నుంచి 20 స్వయం సహాయక సంఘాలను ఒక స్లమ్ లెవల్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్)గా ఏర్పాటు చేసి ఒక్కో ఎస్‌ఎల్‌ఎఫ్‌కు ఒక ఆర్పీని నియమించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు)గా నియమింపబడాలంటే స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉండాలి. స్వయం సహాయక సంఘాలను కేవలం పేదలతోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆమె ఉన్న సంఘంను విజయవంతంగా నిర్వహించి ఆర్థిక లావాదేవీల్లో సంఘం ఉన్నతంగా ఉండేలా చూడాలి. ఆమె సంఘం ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరి ఉండాలి. పదో తరగతి చదువుకుని మహిళా సంఘాల నిర్వహణ గురించి తెలిసి ఉండాలి. ఆమె సమాఖ్య రికార్డుల నిర్వహణ, బ్యాంకు లావాదేవీలు, సభ్యుల అవసరాలను గుర్తించి వారికి సంఘం ద్వారా చేయూతనిచ్చే విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. కానీ స్థానిక మెప్మా కార్యాలయంలో ధనికులే పెత్తనం చెలాయిస్తున్నారు. పట్టణ సమాఖ్యకు అధ్యక్షులు, కార్యదర్శులు ఉద్యోగుల భార్యలే. టీడీపీకి అనుబంధ సంస్థగా ఏర్పాటై పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు వారికి దక్కకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది. మెప్మాకు అందని ప్రభుత్వ ఫలాలు... పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సభ్యత్వం తీసుకుని ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరిన మహిళా సంఘాలన్నీ టౌన్ లెవల్ ఫెడరేషన్ టీఎల్ఎఫ్గా ఏర్పడతాయి. ఇలా పట్టణంలో 35 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి. టీఎల్ఎఫ్లో చేరిన మహిళలకు, వీధి వ్యాపారులకు, ఇతర చిన్న పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు స్త్రీనిధి, రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. దీంతో పాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. ఇక్కడ తీసుకున్న రుణాలను పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా స్థిరపడేందుకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి మహిళాసాధికారత దిశగా నడిపించాలి. కేవలం బ్యాంకు రుణాలు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీఎల్ఎఫ్లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని తెలుస్తోంది. దీంతో పేదలై గ్రూపు సభ్యులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఓ ఆర్పీ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో కార్యాలయంలో పెత్తనం సాగిస్తూ అధికారులతో కలిసి వడ్డీలేని రుణాలు, స్కాలర్షిప్ నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు ఆర్పీలు మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తామని మహిళల వద్ద పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడగా, బాధితులు కార్యాలయానికి వస్తున్నారని వారు అటు వైపు వెళ్లడం మానేశారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు మెప్మా కార్యాలయంపై పర్యవేక్షణ లేకపోవడం వలనే ఇవన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్పీలుగా ఉద్యోగుల భార్యలు ఉండకూడదు ఆర్పీలుగా ఉద్యోగులు, ఉద్యోగుల భార్యలు పనిచేయరాదు. ఇప్పటికే అంజనీదేవి అనే మహిళ తాను గతంలో ఆర్పీగా పనిచేస్తుండగా తనను తొలగించి ఉద్యోగుల భార్యను నియమించుకున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నేను గిద్దలూరుకు రాక ముందు జరిగింది. అనర్హులను తొలగిస్తున్నాము. మహిళా సంఘాలకు ప్రస్తుతానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. ప్రపోజల్స్ పంపిస్తున్నాం. రుణాలు ఇప్పిస్తామని నగదు వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని కార్యాలయానికి రావద్దని చెప్పాం. ఆర్పీలుగా తొలగించాల్సి ఉంది. త్వరలో అన్నింటినీ సరిచేస్తాం. – చంద్రశేఖర్, సిటీ మిషన్ మేనేజర్, గిద్దలూరు ఆర్పీగా తొలగించారు నేను నాలుగు సంవత్సరాల పాటు ఆర్పీగా పనిచేశాను. ఇటీవల ఆర్పీల జాబితాను ప్రభుత్వానికి పంపాలని వచ్చినప్పుడు తన పేరు తొలగించి వేరొకరి పేరు పంపారు. దీంతో తాను ఉద్యోగం కోల్పోయాను. టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారంలో తిరగలేదన్న కక్షతో తనను నిర్దాక్షిణ్యంగా ఆర్పీ నుంచి తొలగించారని, ఆర్పీలంతా ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు చేసే వారే ఉన్నారు. తనకు ఆర్పీగా ఉద్యోగం ఇప్పించాలని స్థానిక అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి. – పి.అంజనీదేవి, రాజానగర్, గిద్దలూరు. -
పొదుపు మహిళల కన్నెర్ర
పొదుపు మహిళలు టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు – కుంకుమ పేరుతో మరోసారి మోసం చేశారని చెబుతున్నారు. చెక్కులను బ్యాంక్‌ల్లో వేస్తుంటే నగదు రావడంలేదని, పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారని మహిళలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంక్‌ల ఎదుట నిరసన చేపట్టారు. నెల్లూరు సిటీ: పసుపు – కుంకుమ పథకం కింద మూడు దఫాలుగా ఇచ్చిన చెక్కులను ఒకేసారి చెల్లించాలని పొదుపు సమన్వయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయం ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు విడతలుగా రూ.10 వేలు చెల్లించడం చూస్తుంటే అది ఓట్ల కోసమే అని అర్థమవుతోందన్నారు. మొదటి చెక్కును బ్యాంక్‌లో జమ చేసినా బ్యాంకర్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదన్నారు. మూడు చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. వేలమందికి ఇప్పటి వరకు చెక్కులు అందలేదన్నారు. ప్రతిరోజూ మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరి చెక్కులను బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మాత్రమే పొదుపు మహిళలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి మస్తాన్ బీ, రెహానాబేగం, షామీనా బేగం తదితరులు పాల్గొన్నారు. -
మెప్మా ..ఇదేంటి చెప్మా..
తిరుపతి తుడా: అవినీతి, అక్రమాలతో ఇప్పటికే అభాసుపాలైన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో వేధింపులకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. అక్క డి అవినీతి జాడ్యాన్ని భరించలేని ఓ మ హిళ ప్రభుత్వం నుంచి మెప్మాకు అందుతున్న నిధులు, జమా ఖర్చు వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగింది. దీంతో ఆ మహిళకు అధికారుల నుంచే కాకుండా అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 4200 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 43 వేల మంది సభ్యులుగా ఉన్నారు. మీనాక్షి సమాఖ్యలో కొర్లగుంట చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన హేమలత సభ్యురాలు. గతంలో ఆర్పీగా పనిచేసేది. అనివార్య కారణాలతో ఏడాది క్రితం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. మెప్మా అధికారుల అక్రమాలు, అవినీతిని భరించలేక బయటపడినట్లు సన్నిహితుల వద్ద ఆవేదనవ్యక్తం చేసేది. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి నిధులు అందుతున్నాయి, ఖర్చుల వివరాల కోసం హేమలత భర్త ఆర్టీఏకు దరఖాస్తు చేశారు. ఫలితంగా ఆమెకు.. కుటుంబానికి వేధింపులు మొదలయ్యాయి. గుట్టు బయటపడుతుందనే.. హేమలత అడిగిన వివరాలను చూసిన అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. సమాచారం బయటకు పొక్కితే మెప్మా గుట్టు బయటపడుతుందని అధికారులు తిరుపతిలోని అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు ఆ మహిళపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ వివరాలు ఎందుకంటూ అధికార పార్టీలో కీలక నాయకుడొకరు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన చెందుతోంది. పలుకుబడి, పరిచయాలతో మిగిలిన మూడు టీఎల్ఎఫ్లో పనిచేస్తున్న కొంతమంది సభ్యుల ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. అండగా నిలవాల్సిన తోటి సభ్యులు, అధికార పార్టీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీఏ కింద సమాచారం ఇవ్వకుండా మూడు నెలలుగా కాలయాపన జరుగుతోంది. వేధింపులు పరాకాష్టకు చేరడంతో ఆ మహిళ శనివారం ఈస్టు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మెప్మా.. మెప్మా అధికారులు రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బంధువు ద్వారా పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆర్టీఏ కింద ఆమె అడిగిన సమాచారం ఇస్తే అవినీతి, అక్రమాలు బయటపడతాయని, తమతో పాటు సంఘాల లీడర్ల అవినీతి బాగోతం బయటపడుతుందని మహిళా సంఘాల సభ్యులను రెచ్చగొట్టి ఆమెపైకి ఉసిగొల్పుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు మెప్మా కార్యాలయానికి వస్తే చర్చించుకోవచ్చని పీడీ కోరినట్టు తెలుస్తోంది. -
లంచం అడుగుతున్నారు..
మెప్మా కార్యాలయంలో డ్వాక్రా మహిళల ధర్నా ఖమ్మం సిటీ : బ్యాంకు రుణం అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి మెప్మా కార్యాలయంలో లంచం అడుగుతున్నారని ఆరోపిస్తూ..ఖమ్మం గాంధీ సమాఖ్యకు చెందిన మూడు డ్వాక్రా సంఘాల మహిళలు బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేషన్ కార్యాలయం అవరణలోని నగర మెప్మా కార్యాలయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లక్షకు రూ.500 మామూలు ఇస్తేనే సంతకం పెడతామని డిమాండ్ చేశారని ఆరోపించారు. అలా ఇవ్వకపోతే డ్యాక్యుమెంటేషన్ సరిగా లేదని, తీర్మానం కాపీ లేదని, డ్యాకుమెంటేషన్ తనిఖీలు చేశాక సంతకం పెడతమని ఇబ్బంది పెడుతున్నారని మహిళలు అవేదన వ్యక్తం చేశారు. సంతకం చేయాలని జూనియర్ మ్రైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లను కోరితే..అరగంటలో వస్తానని కార్యాలయం నుంచి వెళ్లి గంటల తరబడి రాలేదని తెలిపారు. సీఓ సుల్తానా దురుసుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సిబ్బంది ఆందోళన విషయూన్ని పీడీ వేణుమనోహర్రావుకు, బిల్డింగ్ ఇన్‌స్ట్రక్చర్ కమలశ్రీకి ఫోన్లో సమస్యను వివరించారు. సీఓ ఉపేంద్రమ్మను వెళ్లి డాంక్యుమెంటేషన్పై సంతకం చేసి ఇవ్వాలని ఆదేశించడంతో డ్వాక్రా మహిళలు ఆందోళన విరమించారు. ఈ విషయమై..మైక్రో ఫైనాన్స్ అధికారి వెంకటేశ్వర్లుకు ‘సాక్షి’ వివరణ కోరగా..తాము ఎవ్వరినీ లంచం అడగలేదని, అలా అడిగి ఉంటే రుజువు చేయూలని అన్నారు. డ్యాక్యుమెంటేషన్లను సీఓతో విచారణ చేయించి, అన్నీ పరిశీలించాకనే అందజేస్తామని తెలిపారు.