పొదుపు మహిళలు టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసుపు – కుంకుమ పేరుతో మరోసారి మోసం చేశారని చెబుతున్నారు. చెక్కులను బ్యాంక్‌ల్లో వేస్తుంటే నగదు రావడంలేదని, పాత బకాయిల కింద జమ చేసుకుంటున్నారని మహిళలు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంక్‌ల ఎదుట నిరసన చేపట్టారు.
నెల్లూరు సిటీ: పసుపు – కుంకుమ పథకం కింద మూడు దఫాలుగా ఇచ్చిన చెక్కులను ఒకేసారి చెల్లించాలని పొదుపు సమన్వయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయం ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు విడతలుగా రూ.10 వేలు చెల్లించడం చూస్తుంటే అది ఓట్ల కోసమే అని అర్థమవుతోందన్నారు. మొదటి చెక్కును బ్యాంక్‌లో జమ చేసినా బ్యాంకర్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదన్నారు.
మూడు చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని చెబుతున్నారన్నారు. వేలమందికి ఇప్పటి వరకు చెక్కులు అందలేదన్నారు. ప్రతిరోజూ మెప్మా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరి చెక్కులను బ్యాంకర్లు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మాత్రమే పొదుపు మహిళలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి మస్తాన్ బీ, రెహానాబేగం, షామీనా బేగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment