ఇరాన్‌లో యూనివర్సిటీ విద్యార్థిని ఆగ్రహం
టెహ్రాన్: బహిరంగంగా మహిళల వేషధారణపై కఠిన నిబంధనలు, కట్టుబాట్లను అమలుచేస్తున్న ఇరాన్‌లో ఓ విద్యార్థిని నిరసన గళం విప్పారు. ముఖం కనిపించకుండా సంప్రదాయ వస్త్రం ధరించలేదన్న కారణంగా టెహ్రాన్‌లో ఆ విద్యార్థినిపై బసీజ్ పారామిలటరీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇందుకు వేదికైంది.
వాగ్వాదంలో బసీజ్ పారామిలటరీ సభ్యులు ఆ వర్సిటీ విద్యార్థిని దుస్తులు చింపేశారు. దీంతో ఆగ్రహంతో ఆ అమ్మాయి చిరిగిన బట్టలు పక్కన పడేసి లోదుస్తుల్లో తన నిరసన వ్యక్తంచేసింది. విద్యార్థినులపై కఠిన మత చట్టాలను అమలుచేయడమేంటని నిలదీసింది. అలాగే లోదుస్తుల్లో వందలాది విద్యార్థినీవిద్యార్థుల మధ్యలో వర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసింది.
దీంతో సాధారణ దుస్తుల్లో వచి్చన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కారులో కుక్కి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దీంతో ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ సంస్థ స్పందించింది. ‘‘ ఆమె ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. బేషరతుగా విద్యార్థిని తక్షణం విడుదలచేయాలి. ఆమెను పోలీసులు కొట్టడం, వేధించడం చేయొద్దు. కుటుంసభ్యులు, లాయర్‌తో మాట్లాడే అవకాశం కల్పించాలి. పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇరాన్ డిమాండ్ చేసింది. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమినీ అనే యువతిని నైతిక పోలీసులు చిత్రవధ చేసి చంపడం, అది ఇరాన్‌లో భారీ నిరసనలకు దారితీయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment