
తనను మునిసిపల్ కమిషనర్ దూషించారని ఆరోపణ
కుప్పం రూరల్: రోడ్డు సమస్య పరిష్కరించాలంటూ ఓ మహిళ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం కొత్తపేటకు చెందిన సోమశేఖర్ భార్య హిమబిందు తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించారని మునిసిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ దారిలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు దారి సౌకర్యం కల్పించాలని కోరింది.
ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ తనతో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడారని, రోడ్డు సమస్యను పరిష్కరించలేదని ఆమె నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు మహిళను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రోడ్డు మూసివేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మునిసిపల్ కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. శనివారం సాయంత్రం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో తన తప్పు ఏమీలేదని, హిమబిందు తనకు కూతురు లాంటిందని వివరణ ఇచ్చారు.