‘నైట్ ఈజ్ అవర్స్’ పేరుతో ఆగస్టు 14 అర్ధరాత్రి కోల్‌కతాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు.అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాని అర్ధరాత్రి సురక్షితంగా జీవించే హక్కు స్త్రీలకు రాకపోవడంపై ఈ నిరసన.కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో రాత్రిని చూసి భయపడుతూ బతకవలసిందేనా అని నిలదీస్తున్నారు స్త్రీలు.ఈ నిరసన, గతంలో ఇలాంటి ప్రతిఘటనలపై కథనం.
‘ఏ రోజైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అన్నారు గాంధీజీ. ఆయన కలలుగన్న స్వాతంత్య్రం ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉంది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో అర్ధరాత్రి ఒక నిర్భయ దారుణంగా లైంగికదాడికి లోనై మరణిస్తే మొన్న గురువారం (ఆగస్టు 8) అర్ధరాత్రి కోల్‌కతాలోని ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒక ట్రయినీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికీ హత్యకూ లోనైంది. దీంతో దేశవ్యాప్తంగా వైద్యబృందాలు భగ్గుమన్నాయి. నిరసనలు సాగుతున్నాయి. వైద్యులు వైద్యసేవలు మాని ఈ అన్యాయానికి జవాబేమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణ న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.
అర్ధరాత్రి నిరసన
‘ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వచ్చింది. కాని స్త్రీలకు తమ ఇంట్లో, పని చోట, బహిరంగ ప్రదేశాల్లో రాత్రుళ్లు ఎటువంటి స్వేచ్ఛ లేని బానిసత్వమే మిగిలింది. కోల్‌కతాలో జరిగిన దారుణకాండ కు నిరసనగా ఈ ఆగస్టు 14 అర్ధరాత్రి మహిళలందరం నిరసన చేయనున్నాం’ అని కోల్‌కతాలోని మహిళలు తెలియచేస్తున్నారు. ఈ నిరసకు స్త్రీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. మనదేశంలో సూర్యుడు అస్తమించగానే స్త్రీలలో, వారి కుటుంబ సభ్యుల్లో ఆ స్త్రీలు ఇంటికి చేరే వరకు ఆందోళన ఉంటుంది.
వారి మీద ఏదోవిధమైన దాడి జరిగే వాతావరణం ఉండటమే ఇందుకు కారణం. ఒంటరి స్త్రీ బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తే ఆమెతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే తెగింపు కొన్ని మూకలలో ఈ సమాజంలో ఉంది. స్త్రీలకు పరిమిత సమయాలలో పరిమిత స్థలాలలోనే రక్షణ. లేదంటే లేదు. అయితే నిర్భయ ఘటన ఆమె రోడ్డు మీద ఉన్నప్పుడు జరిగితే కోల్‌కతాలో బాధితురాలు ఆస్పత్రిలో తన డ్యూటీలో ఉండగా దాడి జరగడం తీవ్రమైన ప్రశ్నను లేవదీసేలా ఉంది.
మీట్ టు స్లీప్
నిర్భయ ఘటన జరిగాక ఆమెను తలుచుకుంటూ ప్రతి డిసెంబర్ 16న పార్కుల్లో మహిళలు బృందాలుగా నిదురించే కార్యక్రమం ‘మీట్ టు స్లీప్’ నిర్వహించాలని బెంగళూరుకు చెందిన ‘బ్లాక్ నాయిస్’ అనే సంస్థ పిలుపునిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ‘పబ్లిక్ ప్లేసులపై మా హక్కు కూడా ఉంది. మేము అక్కడ సురక్షితంగా ఉంచే పరిస్థితిని డిమాండ్ చేస్తున్నాం’ అని ఈ కార్యక్రమం కోరుతోంది. బ్లాక్ నాయిస్ ఫౌండర్ జాస్మిన్ పతేజా దీని రూపకర్త.
విమెన్ వాక్ ఎట్ మిడ్‌నైట్:
ఢిల్లీ రోడ్ల మీద అర్ధరాత్రి స్వేచ్ఛగా నడిచే హక్కు స్త్రీలకు ఉంది అని ‘విమెన్ వాక్ ఎట్ మిడ్‌నైట్’ పేరుతో అక్కడి మహిళా బృందాలు రాత్రుళ్లు నడిచి తమ గళాన్ని వినిపించాయి. మల్లికా తనేజా అనే థియేటర్ ఆర్టిస్ట్ ఇందుకు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘రాత్రిపూట ఖాళీ ఫుట్‌పాత్ మీద స్వేచ్ఛగా కూచునే అనుభూతి ఇప్పుడు పొందాను’ అని ఈ అర్ధరాత్రి నడకలో పాల్గొన్న ఒక మహిళ అంది.
సమాజంలో స్త్రీకి గౌరవం దక్కాలన్నా ఆమె సురక్షితంగా ఉండాలన్నా ఇంటిలో బడిలో పని చోట్ల ప్రభుత్వ విధానాలలో సినిమాలలో కళల్లో ఆమెను గౌరవించే వాతావరణం, బౌద్ధిక శిక్షణ అవసరం. కఠినమైన చట్టాలతో పాటు విలువల ఔన్నత్యం కూడా అవసరం. స్త్రీలను కించపరిచే భావజాలం ఎక్కడ ఉన్నా దానిని నిరసించడం అందరూ నేర్వాలి. లేని పక్షంలో అర్ధరాత్రి నిరసనలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment