ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ అనే యువకుడిని రెండు రోజుల క్రితం మావోయిస్టులు అపహరించారు.
ఏడుగురాళ్లపల్లి(చింతూరు) : ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ అనే యువకుడిని రెండు రోజుల క్రితం మావోయిస్టులు అపహరించారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో మండలంలో కలకలం రేగింది. గ్రామంలో జెరాక్స్ షాపు నిర్వహిస్తున్న శంకర్‌ను మావోయిస్టులు తమవెంట ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ పోలీసులకు పట్టుబడడంలో శంకర్ హస్తం ఉందని, అందుకే అతడిని తామే కిడ్నాప్ చేశామని ధ్రువీకరిస్తూ ఓ మావోయిస్టు నేత పేరిట భద్రాచలంలోని ఓ పత్రికా కార్యాలయానికి లేఖ పంపారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు దీనిపై ఆరాతీసే పనిలో పడ్డారు.