కలెక్టరేట్‌కు వచ్చిన యువతి
జయపురం : దేశంలో మావో యిస్టులు, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. పోలీసు బలగాలు, జవాన్లు మావోయిస్టుల స్థావరాలపై దాడులు జరుపుతూ వారిని మట్టుపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయినా మావోయిస్టుల ప్రభావం తగ్గటం లేదు సరికదా గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా యువత మావోయిస్టుల ఉద్యమాలలో చేరుతున్నారు. అందుకు కారణాలను పాలకులు విశ్లేషిస్తున్నట్టు కనపడడం లేదు. ముఖ్యంగా మౌలిక సౌకర్యాలు లేకపోవటం, ఆహార భద్రత, జీవించే హక్కు కనిపించకపోవటం వల్లే పలువురు గ్రామీణ ప్రాంత యువత మావోల పోరాటాల బాటపడుతున్నట్టు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
వారి అభిప్రాయంలో అవాస్తవంలేదని ఒడిశా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండాగాం జిల్లాలో శనివారం చోటుచేసుకున్న సంఘటన వెల్లడిస్తుంది. వోయిస్టులకు అడ్డగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక యువతి కొండాగాం జిల్లా కలెక్టర్‌ను కలిసి తాను మావోస్టుల సంఘంలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అందుకు కారణం వారి జీవనాధారమైన చిన్న కాఫీ దుకాణాన్ని తొలగించటమేనట. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే కాకుండా సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో చర్చనీయమైంది. లలిత పోయమ్ అనే ఆ యువతి కుటుంబం రోడ్డుపక్కన చిన్న టీ దుకాణం పెట్టుకొని బతుకుతుంది. కొండాగాం జిల్లా బొడకురిసినా గ్రామం వద్ద ప్రభుత్వ స్థలంలో ఆమె తాత ఎంతో కాలంగా ఒక చిన్న టీ దుకాణం పెట్టుకొని తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ప్రభుత్వ స్థలంలో చట్టవిరుద్ధంగా దుకాణం పెట్టారని చెçప్పి ప్రభుత్వ అధికారులు ఈ దుకాణాన్ని పడగొట్టారు. ఉన్న ఒక్క జీవనాధారం పోవటంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
జీవించేందుకు మరో మార్గంలేక పలుఇబ్బందులు పడుతున్నామని, టీ దుకాణాన్ని అదే స్థలంలో పెట్టేకునేందుకు అనుమతించాలని, ఆర్థిక సహాయం కూడా చేయాలని ఆ యువతి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన అభ్యర్థనను అంగీకరించకపోతే తాము మావోయిస్టుల ఉద్యమంలో చేరుతామని స్పష్టం చేసింది. మావోయిస్టుల ఉద్యమంలో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కొండాగాం జిల్లా కలెక్టర్‌ను ఆమె అభ్యర్థిచిందని సమాచారం. కేవలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే కాదు ఆ రాష్ట్ర సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని అందుచేతనే యువతీ యువకులు మావోయిస్టుల బాట పడుతున్నారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అందుచేత ప్రభుత్వాలు స్పందించి ప్రజలకు మౌలిక అవసరాలు తీర్చటంతో పాటు వారు జీవించేందుకు తగిన పరిస్థితులు కల్పిస్తే లలిత పోయమ్ లాంటి యువతీయువకులు మావోయిస్టులలో చేరుతామని ఎన్నడూ అనరని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment