బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడను రాజ్‌భవన్ వర్గాలు, గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా అవమానించడంపై ఆ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. గవర్నర్ చర్యను నిరసిస్తూ నగరంలో గురువారం ధర్నాకు దిగారు. నగరంలోని ఆనందరావ్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించిన జేడీఎస్ కార్యకర్తలు గవర్నర్ వజుభాయ్ వాలా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన జేడీఎస్ సీనియర్ నేత వై.ఎస్.వి.దత్త మాట్లాడుతూ.....మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడకు జరిగిన అవమానం ఆయన ఒక్కడికి జరిగింది కాదని, యావత్ కర్ణాటక రాష్ట్రానికి జరిగిన అవమానమని ఆక్రోశం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రంలోని సమస్యలపై వినతి పత్రం అందజేసేందుకు రాజ్‌భవన్‌కు వెళితే ఆయనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ నడుచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఈసంఘటనకు గవర్నర్ కేవలం క్షమాపణ చెబితే సరిపోదని ఆయన్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కన్నడ సంఘాలన్నీ ఏకతాటి పైకి వచ్చి ఈ విషయంపై పోరాటం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే శరవణ మాట్లాడుతూ.....రాజ్‌భవన్‌కు ‘నో ఎంట్రీ’ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేదని వ్యంగ్యమాడారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ కన్నడ ఆస్తి అని, ఆయనను అవమానించడం అంటే కర్ణాటక ప్రజలందరినీ అవమానించడమేనని ఆక్రోశం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఇటీవలి కాలంలో గుజరాత్ భవన్‌లా మారిపోయిందని మండిపడ్డారు. గవర్నర్ వజుభాయ్ వాలాను తక్షణమే ఆ పదవి నుండి తప్పించాలని కోరుతూ త్వరలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపాలయ్యతో పాటు పెద్ద ఎత్తున జేడీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవెగౌడకు అవమానంపై జేడీఎస్ కన్నెర్ర
Published Fri, Apr 8 2016 2:45 AM | Last Updated on Tue, Aug 21 2018 11:54 AM
Advertisement
Advertisement