దేవెగౌడ కుటుంబం నుంచి లోక్‌సభ బరిలో ముగ్గురు
గత ఎన్నికల్లోనూ అంతే మొత్తం తొమ్మిది మంది రాజకీయాల్లో
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్‌పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్‌సభ ఎన్నికలు.
వరుసగా రెండోసారి...
ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.
ఏ ఎన్నికల్లో చూసినా...
దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది.
అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment