Private Limited Company
-
HD Deve Gowda: ఫ్యామిలీ ప్యాకేజీ
కర్నాటక జనాలకు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం విశేషం. తమ వొక్కళిక సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో వారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో ప్రత్యర్థులు జేడీ(ఎస్)ను ‘ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ’ అంటూ జోరుగా ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవలి కాలం దాకా ఇవే విమర్శలు చేసిన బీజేపీ ఈసారి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడం విశేషం!కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జేడీ(ఎస్)కు మూడు దక్కాయి. వాటిలో జేడీ(ఎస్) కంచుకోట అయిన మండ్య నుంచి దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి, హసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథ్ బీజేపీ టికెట్‌పై బెంగళూరు రూరల్ నుంచి బరిలో ఉండటం విశేషం! చన్నపట్న అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారస్వామికి ఇవి ఆరో లోక్‌సభ ఎన్నికలు.వరుసగా రెండోసారి...ఇలా దేవెగౌడ కుటుంబంనుంచి ముగ్గురు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీ(ఎస్)కు బాగా పట్టుంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2019లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జేడీ (ఎస్)కు 9 సీట్లు దక్కాయి. తుముకూరు నుంచి దేవెగౌడ, హసన్ నుంచి ప్రజ్వల్, మండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేశారు. ప్రజ్వల్ ఒక్కరే గెలిచారు.ఏ ఎన్నికల్లో చూసినా...దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో రేవణ్ణ, కుమారస్వామి రాజకీయాల్లో ఉన్నారు. రేవణ్ణ హోలెనర్సిపుర ఎమ్మెల్యే. ఆయన భార్య భవాని జిల్లా పరిషత్ సభ్యురాలిగా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇప్పించుకునేందుకు రేవణ్ణ విఫలయత్నం చేశారు. వారి ఇద్దరు కుమారుల్లో ప్రజ్వల్ హాసన్ ఎంపీ కాగా సూరజ్ ఎమ్మెల్సీ. రెండుసార్లు సీఎంగా చేసిన కుమారస్వామి తన కొడుకు నిఖిల్‌ను రాజకీయాల్లో నిలబెట్టేందుకు 2019 నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.జేడీ(ఎస్) యువజన విభాగం నేతగా ఉన్న నిఖిల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసినా ఓటమి పాలే అయ్యారు. ఈసారి మండ్యలో కుమారస్వామి గెలిస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అక్కడి నుంచి ఉప ఎన్నికలో నిఖిల్ పోటీ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. కుమారస్వామి భార్య అనిత రామనగర ఎమ్మెల్యేగా చేశారు. దేవెగౌడ మరో కుమారుడు రమేశ్ భార్య సౌమ్య కూడా గత ఎన్నికల్లో పోటీకి విఫలయత్నం చేశారు. ఆమె తండ్రి డీసీ తమ్మన్న మద్దూరు జేడీ(ఎస్) ఎమ్మెల్యే. ఇదంతా పార్టీ ప్రయోజనాల కోసమేనని కుమారస్వామి సమరి్థంచుకుంటున్నారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వాతి సన్‌సోర్స్‌కు షాక్
సాక్షి, అనంతపురం : పరిశ్రమ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ భూములు కొట్టేసి.. ఆ స్థలాలను ఇతరులకు లీజుకిచ్చిన ‘స్వాతి సన్‌సోర్స్’ పరిశ్రమ నిర్వాహకులకు ఏపీఐఐసీ అధికారులు షాక్ ఇచ్చారు. పరిశ్రమ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని, వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని పరిశ్రమ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. సాక్షి కథనంతో అధికారుల్లో కదలిక స్వాతి సన్‌సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమ పేరుతో ఏపీఐఐసీ నుంచి తీసుకున్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవంతులు నిర్మిస్తున్న వైనంపై ‘అవినీతి వెలుగులు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జోనల్ మేనేజర్ గోపీకృష్ణ గురువారం పెనుకొండ సమీపంలోని స్వాతి సన్ సోర్స్ పరిశ్రమను పరిశీలించారు. ఏపీఐఐసీ నుంచి కేవలం ఒక భవన నిర్మాణానికే అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లు ఎలా నిర్మిస్తారని పరిశ్రమ నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న స్థలాలను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమన్నారు. పరిశ్రమను నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి.. అక్రమంగా భవంతులను నిర్మించి అద్దెలకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చకూడదో సమాధానం చెప్పాలని నోటీసులను జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి జవాబు రాగానే 15 రోజుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. -
టాటా సన్స్.. ‘ప్రైవేట్’!
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్పునకు సన్నాహాలు ► షేర్ హోల్డర్ల అనుమతి కోరిన కంపెనీ ► వ్యతిరేకిస్తూ మిస్త్రీ సంస్థ లేఖ ► మైనారిటీ వాటాదారుల్ని అణిచేయటానికేనని ఆరోపణలు న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. ఈ మేరకు ఈ నెల 21న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు షేర్హోల్డర్లకు సంస్థ సమాచారం ఇచ్చింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది.కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపాయి. తమకున్న ‘డీమ్డ్ పబ్లిక్ కంపెనీ’ హోదాకు .. కంపెనీల చట్టం 2013 కింద గుర్తింపు లేకపోవడం వల్లే ఈ మేరకు మార్పులు తలపెట్టినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ తీర్మానం గానీ ఆమోదం పొందిన పక్షంలో.. వాటాదారులు స్వేచ్ఛగా షేర్లను విక్రయించుకోవడంపై నిర్ధిష్ట నియంత్రణలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం సంస్థలో గణనీయమైన వాటాలున్న మిస్త్రీ కుటుంబం.. ఆ షేర్లను బయటి ఇన్వెస్టర్లకు అమ్ముకోకుండా చెక్ చెప్పేందుకే టాటా సన్స్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్వరూపం మార్చాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మిస్త్రీ కుటుంబం భావిస్తోంది. కార్పొరేట్ స్వరూపం మార్పునకు ప్రత్యేక తీర్మానం కావాలి. దీనికి మద్దతుగా కనీసం 75 శాతం మేర షేర్‌హోల్డర్ల ఓట్లు అవసరమవుతాయి. వీటితో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర కూడా అవసరమవుతుంది. మిస్త్రీ సంస్థల అభ్యంతరం.. టాటా సన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నందున .. అందులో గణనీయమైన వాటాలు ఉన్న మిస్త్రీల కుటుంబం తమ షేర్లను చట్టబద్ధంగా టాటాల పోటీ సంస్థలకు కూడా విక్రయించుకోవచ్చు. ఇది కంపెనీల చట్టం చెబుతున్న నిబంధన. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాని షేర్‌హోల్డరుకు ఈ వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో.. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రతిపాదనపై మిస్త్రీ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మెజారిటీ షేర్ హోల్డర్లు మైనారిటీ వాటాదారులను అణచివేసేందుకు చేస్తున్న మరో ప్రయత్నమిది. దీనివల్ల టాటా సన్స్‌కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దురుద్దేశాలు, దుర్బుద్ధితోనే ఈ ఏజీఎం ఏర్పాటు చేస్తున్నారు‘ అని వ్యాఖ్యానించింది. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఈ మేరకు టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం వల్ల షేర్లను స్వేచ్ఛగా బదలాయించుకునేందుకు వీలు లేకుండా నియంత్రణలు అమల్లోకి వస్తాయని, ఇది ఓ రకంగా మైనారిటీ వాటాదారులను మెజారిటీ షేర్హోల్డర్లు అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. సైరస్ మిస్త్రీని గతేడాది చైర్మన్‌గా తొలగించిన నేపథ్యంలో టాటా సన్స్‌తో మిస్త్రీ కుటుంబం న్యాయ పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి 18.4 శాతం వాటాలు, టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం వాటాలు ఉన్నాయి. -
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్!
* టీఎస్ఐఐసీకి అనుబంధంగా ఏర్పాటు * పారిశ్రామిక పార్కు అభివృద్ధి బాధ్యత నూతన కంపెనీకి.. * 18 నెలల్లో 12,635 ఎకరాలు నూతన కంపెనీకి బదిలీ సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ప్లాట్ల కేటాయింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికిల్)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి అనుబంధంగా మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటైనా.. మాతృసంస్థ టీఎస్ఐఐసీ వంద శాతం ప్రభుత్వ సంస్థ కావడంతో నూతన కంపెనీ కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. భూమి అప్పగింతకు సన్నాహాలు నిమ్జ్ ఏర్పాటుకు మెదక్ జిల్లా జహీరాబాద్, న్యాలకల్ మండలాల్లో 12,635 ఎకరాలను గుర్తించారు. మూడు దశల్లో 18 నెలల వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలని... తొలి దశలో కనీసం మూడు వేల ఎకరాలు అప్పగిస్తేనే నిమ్జ్ హోదా దక్కుతుందని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక విభాగం (డిప్) స్పష్టీకరించింది. మొత్తం భూసేకరణకు రూ.2,450 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్ల మేర విడుదల చేసింది. తొలి విడతకు సంబంధించి మూడు వేల ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో... దానిని మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్‌కు అప్పగించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇక పనులు వేగవంతం రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితరాలు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ నిమ్జ్ వంటి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి సవాలుతో కూడుకున్నది కావడంతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని డిప్ షరతు విధించింది. ఈ మేరకు ‘మెదక్ నిమ్జ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి టీఎస్ఐఐసీకి భూ బదిలీ జరిగిన వెంటనే పార్కు అభివృద్ధికి సంబంధించిన సంపూర్ణ నివేదిక తయారీ, పర్యావరణ అనుమతులు, లే ఔట్ రూపకల్పన, కాంట్రాక్టు సంస్థల ఎంపిక తదితర కార్యకలాపాలన్నీ మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీఎస్ఐఐసీ అధికారులనే కేటాయిస్తారా, లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు నిమ్జ్ హోదా దక్కే పారిశ్రామిక వాడలకు కేంద్రం భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ పారిశ్రామిక వాడకు ప్రధాన మార్గాలతో అనుసంధానం, మౌలిక సౌకర్యాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్రం వంద శాతం గ్రాంటు రూపంలో అందిస్తుంది. దీంతోపాటు అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. మెదక్ నిమ్జ్‌ను ఉదాహరణగా తీసుకుంటే మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలో, అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. ఈ నిమ్జ్‌తో 2022 నాటికి సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. కేంద్ర నిబంధనల మేరకు ఏదైనా పారిశ్రామిక వాడకు నిమ్జ్ హోదా దక్కాలంటే 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా 5 వేల హెక్టార్ల (సుమారు 12,500 ఎకరాల) స్థలం ఉండాలి. -
తెలంగాణలో అవినీతి అంతమే ధ్యేయం
‘ఆప్’ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ కవాడిగూడ: కేసీఆర్ కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తయారు చేయడమే ఆప్ ప్రధాన ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భార్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది. పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నా ప్రజలకు సరైనా న్యాయం జరగడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ అవినీతి విచ్చలవిడిగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి, ఆయన మాత్రం రూ.10 లక్షల విలువ చేసే కోట్లు ధరిస్తున్నాడని విమర్శించారు. ఆప్ కార్యకర్తలు ఉత్తమ క్రమశిక్షణతో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తే వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు నమ్రతా జైస్వాల్, సిలివేరు శ్రీశైలం, ఖాలిబ్, నసీమా బేగం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీని ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసింది
విజయనగరం ఫోర్ట్: అధికార పార్టీ అసెంబ్లీని ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసిందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. స్థానిక కోట జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహారిస్తుందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చినా మాట్లాడడానికి చంద్రబాబు ఆశక్తి చూపేవారు కాదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవడానికే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య, చిన్న శ్రీను, రొంగలి పోతన్న, యడ్ల ఆదిరాజు, డోల మన్మధకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
మా కష్టాన్ని కాజేశారు
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దాచు కున్నాం. ఇప్పుడు మా కష్టాన్ని మింగేశారు. న్యాయం చేయండి. - టీకేఎస్ మహాలక్ష్మి ఆడపిల్ల పెళ్లి కోసం ఎప్పటినుంచో పొదుపు చేసుకున్నాం. డబ్బు దాచుకుని మోసపోయాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. న్యాయం జరుగుతుందనే వచ్చాం. - శశి ( వీళ్లిద్దరే కాదు.. ఉమా చిట్‌ఫండ్స్ బాధితులంతా సీపీ వెంకటేశ్వరరావు ఎదుట కన్నీటి పర్యంతమయ్యూరు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో ఉమా చిట్స్ బాధితులు, ఇరువర్గాల న్యాయవాదుల ప్రత్యేక సమావేశం జరగ్గా, బాధితులు తమ గోడు చెప్పుకొని బావురుమన్నారు.) విజయవాడ సిటీ : ‘గతంలో జరిగిందేదో జరిగింది. ఇప్పుడేం జరగాలనే దానిపై నిర్ణయం తీసుకుందాం. న్యాయపరమైన అడ్డంకులను సమన్వయంతో పరిష్కరించుకొని బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేద్దాం’ అని ఉమా చిట్స్‌ఫండ్స్ బాధితుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. 2010లో ఉమా చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మూతపడటంతో వందలాది మంది డిపాజిట్‌దారులు భారీగా నష్టపోయారు. వీరికి న్యాయం చేసే చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిట్స్ అధినేత కాండ్రు ఉమామహేశ్వరుడు అంగీకరించారు. దీంతో గురువారం పోలీసు కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉమా చిట్స్ బాధితులు, ఇరువర్గాల న్యాయవాదులతో సమావేశమయ్యారు. సంస్థ తరుపు న్యాయవాది చోడి శెట్టి మన్మథరావు మాట్లాడుతూ అందరికీ ఇవ్వాల్సిన మొత్తాలను ఆస్తుల వేలం ద్వారా చెల్లించేందుకు కంపెనీ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రామిసరీ నోట్ల కాలపరిమితి ముగిసిందని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆస్తుల అమ్మకంపై కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్నారు. కోర్టులో కేసులు వేసిన వారు సహకరిస్తే సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. బాధితుల తరుపు న్యాయవాది శాస్త్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారంలో సహకరించేందుకు బాధితులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బాధితులందరికి న్యాయం చేస్తామని కచ్చితమైన హామీ ఇస్తే అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చట్టపరిధిలోని అంశాల్లో ప్రభుత్వపరంగా చేసేది తక్కువేనని చెప్పారు. ఈ దృష్ట్యా సమస్య పరిష్కారంలో నిర్దిష్ట కాలపరిమితి పెట్టలేమన్నారు. ఉమా చిట్స్ ఆస్తులను కోర్టు ద్వారా వేలం వేయించి బాధితులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలనేదే ప్రభుత్వ యత్నమని చెప్పారు. పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి వీలైనంత తొందరలోనే బాధితులకు పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నాన్ బ్యాంకింగ్ సంస్థలు డిపాజిట్లు సేకరించే అవకాశం లేకున్నా అధిక వడ్డీలకు ఆశపడి బాధితులే ఇలాంటి వాటికి అవకాశం కలిపిస్తున్నారని చెప్పారు. సంస్థ అధినేత డబ్బు చెల్లించేందుకు ముందుకొచ్చినందున కేసు విచారణ దశలోనే ప్రభుత్వం ద్వారా ఆస్తుల వేలం నిర్వహించే విధంగా చర్యలు చేపడతామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరూ కూడా చట్టపరమైన అడ్డంకులు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉమా చిట్స్ బాధితులు పాల్గొన్నారు. -
విద్యుత్ కోత రోజుకు రెండుసార్లు
విద్యుత్ సరఫరాలో కోత నగరవాసులకు నిత్య సమస్యగా మారింది. వేళాపాళా ఉండకపోవడం, గంటలకొద్దీ విధిస్తుండడంతో వారంతా ఇబ్బందులపాలవుతున్నారు. ఈ సమస్య కేవలం జాతీయ రాజధానికే పరిమితం కాలేదు. జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు రెండుసార్లు, దాదాపు నాలుగు గంటలపాటు కోత విధిస్తున్నారనే విషయం ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. న్యూఢిల్లీ: నగరంలో ప్రతిరోజూ రెండుసార్లు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. అది కూడా దాదాపు నాలుగు గంటలపాటు ఉంటోంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇక జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో కూడా విద్యుత్ సరఫరాలో కోత విధింపు అక్కడి ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రతిరోజూ కనీసం రెండు పర్యాయాలు కోత విధిస్తున్నట్టు తెలిపారు. మార్కెట్ ఎక్సెల్ డాటా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించింది. ఢిల్లీ, గుర్గా వ్, నోయిడా, ఘజియాబాద్‌లకు చెందిన మూడు వేలమందిని ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యు త్ కోత అంశంపై పలు ప్రశ్నలు అడిగారు. కనీసం రోజుకు రెండుసార్లు వవిద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్టు ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్లకు చెందిన 40 శాతం మంది ప్రజలు తెలిపారు. ఒక్కోసారి ఈ కోత దాదాపు నాలుగు గంటలకుపైగానే ఉంటోందన్నారు. కోతకు వేళాపాళా ఉండడం లేదని, మిగతా రోజుల్లోనూ, వారాంతంలోనూ ఒకేరకంగా ఉంటోందన్నారు. వారాంతంలో కోత ఎక్కువగా ఉంటోందని నోయిడాకు చెందిన 36 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. గుర్గావ్, నోయిడా ఢిల్లీలలో మధ్యాహ్నంతోపాటు సాయంత్రం కోత విధిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో కోతకు కారణమేమిటని ప్రశ్నించగాా విద్యు త్ ప్లాంట్‌లో వినియోగిస్తున్న పరికరాలు నాసిరకానికి చెందినవే కావడమన్నారు. దీనికితోడు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, సిబ్బంది పనితీరు అధ్వాన్నంగా ఉండడమేనని 40 శాతం మంది పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ల నిర్వహణాలోపం కూడా మరొక కారణమని వారంటున్నారు. ఆలస్యమే కారణం ఇక గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్‌లలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మరింత ఆలస్యమవడం ఈ సమస్యను మరింత జటిలమవడానికి కారణమై ఉండొచ్చని ఆయా ప్రాంతాలకు చెందిన 28 శాతం మంది అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విద్యుత్ ప్రాజెక్టుల మంజూరులో ఆలస్యం కూడా మరొక కారణం కావొచ్చన్నారు. దీనికితోడు విద్యుత్ డిమాండ్ పెరగడం మరొక కారణమవచ్చన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాలు, అతి వినియోగంవల్ల ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవడం. షార్ట్‌సర్క్యూట్, వర్షాలు, పిడుగుపాట్లు, గాలిదుమారం తదితరాలు కూడా ఈ సమస్య మరింత జటిలం చేసేందుకు దోహదం చేస్తున్నాయి. కాగా విద్యుత్ సరఫరాలో కోత కారణంగా తాము నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోందని ఘజియాబాద్, గుర్గావ్ వాసులు వాపోయారు. దీంతో తాము మరుసటి రోజు విధులకు హాజరు కాలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. దోమల బెడద కూడా బాగా పెరిగిపోయిందనర్నారు. గత ఏడాదినుంచి విద్యుత్ పరిస్థితి మరింత ఘోరంగా మారిందని 50 శాతం కంటే ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. పరిస్థితి గత ఏడాది మాదిరిగానే ఉందని మరో 20 శాతం మంది పేర్కొన్నారు. కాగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం ఈ నెల 15వ తేదీన గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,810 మెగావా ట్లు మాత్రమే. వాస్తవానికి విద్యుత్ కొరత సమస్య లేదని, అయితే బీఎస్ఈఎస్ డిస్కం నెట్‌వర్క్‌లో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందన్నారు.