తెలంగాణలో అవినీతి అంతమే ధ్యేయం
‘ఆప్’ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి సోమనాథ్
కవాడిగూడ: కేసీఆర్ కుటుంబ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తయారు చేయడమే ఆప్ ప్రధాన ధ్యేయమని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భార్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగింది.
పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నా ప్రజలకు సరైనా న్యాయం జరగడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ అవినీతి విచ్చలవిడిగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి, ఆయన మాత్రం రూ.10 లక్షల విలువ చేసే కోట్లు ధరిస్తున్నాడని విమర్శించారు. ఆప్ కార్యకర్తలు ఉత్తమ క్రమశిక్షణతో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తే వచ్చే 2019 ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు నమ్రతా జైస్వాల్, సిలివేరు శ్రీశైలం, ఖాలిబ్, నసీమా బేగం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.