మా కష్టాన్ని కాజేశారు
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దాచు కున్నాం. ఇప్పుడు మా కష్టాన్ని మింగేశారు. న్యాయం చేయండి. - టీకేఎస్ మహాలక్ష్మి
ఆడపిల్ల పెళ్లి కోసం ఎప్పటినుంచో పొదుపు చేసుకున్నాం. డబ్బు దాచుకుని మోసపోయాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. న్యాయం జరుగుతుందనే వచ్చాం. - శశి
( వీళ్లిద్దరే కాదు.. ఉమా చిట్‌ఫండ్స్ బాధితులంతా సీపీ వెంకటేశ్వరరావు ఎదుట కన్నీటి పర్యంతమయ్యూరు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో ఉమా చిట్స్ బాధితులు, ఇరువర్గాల న్యాయవాదుల ప్రత్యేక సమావేశం జరగ్గా,
బాధితులు తమ గోడు చెప్పుకొని బావురుమన్నారు.)
విజయవాడ సిటీ : ‘గతంలో జరిగిందేదో జరిగింది. ఇప్పుడేం జరగాలనే దానిపై నిర్ణయం తీసుకుందాం. న్యాయపరమైన అడ్డంకులను సమన్వయంతో పరిష్కరించుకొని బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేద్దాం’ అని ఉమా చిట్స్‌ఫండ్స్ బాధితుల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. 2010లో ఉమా చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మూతపడటంతో వందలాది మంది డిపాజిట్‌దారులు భారీగా నష్టపోయారు. వీరికి న్యాయం చేసే చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిట్స్ అధినేత కాండ్రు ఉమామహేశ్వరుడు అంగీకరించారు. దీంతో గురువారం పోలీసు కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉమా చిట్స్ బాధితులు, ఇరువర్గాల న్యాయవాదులతో సమావేశమయ్యారు. సంస్థ తరుపు న్యాయవాది చోడి శెట్టి మన్మథరావు మాట్లాడుతూ అందరికీ ఇవ్వాల్సిన మొత్తాలను ఆస్తుల వేలం ద్వారా చెల్లించేందుకు కంపెనీ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రామిసరీ నోట్ల కాలపరిమితి ముగిసిందని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆస్తుల అమ్మకంపై కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్నారు. కోర్టులో కేసులు వేసిన వారు సహకరిస్తే సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. బాధితుల తరుపు న్యాయవాది శాస్త్రి మాట్లాడుతూ సమస్య పరిష్కారంలో సహకరించేందుకు బాధితులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బాధితులందరికి న్యాయం చేస్తామని కచ్చితమైన హామీ ఇస్తే అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చట్టపరిధిలోని అంశాల్లో ప్రభుత్వపరంగా చేసేది తక్కువేనని చెప్పారు. ఈ దృష్ట్యా సమస్య పరిష్కారంలో నిర్దిష్ట కాలపరిమితి పెట్టలేమన్నారు. ఉమా చిట్స్ ఆస్తులను కోర్టు ద్వారా వేలం వేయించి బాధితులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలనేదే ప్రభుత్వ యత్నమని చెప్పారు.
పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి వీలైనంత తొందరలోనే బాధితులకు పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. నాన్ బ్యాంకింగ్ సంస్థలు డిపాజిట్లు సేకరించే అవకాశం లేకున్నా అధిక వడ్డీలకు ఆశపడి బాధితులే ఇలాంటి వాటికి అవకాశం కలిపిస్తున్నారని చెప్పారు. సంస్థ అధినేత డబ్బు చెల్లించేందుకు ముందుకొచ్చినందున కేసు విచారణ దశలోనే ప్రభుత్వం ద్వారా ఆస్తుల వేలం నిర్వహించే విధంగా చర్యలు చేపడతామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరూ కూడా చట్టపరమైన అడ్డంకులు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉమా చిట్స్ బాధితులు పాల్గొన్నారు.