టాటా సన్స్.. ‘ప్రైవేట్’!
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్పునకు సన్నాహాలు
► షేర్ హోల్డర్ల అనుమతి కోరిన కంపెనీ
► వ్యతిరేకిస్తూ మిస్త్రీ సంస్థ లేఖ
► మైనారిటీ వాటాదారుల్ని అణిచేయటానికేనని ఆరోపణలు
న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలకు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా సంస్థ కార్పొరేట్ స్వరూపాన్ని మార్చేసేందుకు టాటా సన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ హోదా నుంచి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చే దిశగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌కు తగు మార్పులు చేర్పులు చేసే ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది.
ఈ మేరకు ఈ నెల 21న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు షేర్‌హోల్డర్లకు సంస్థ సమాచారం ఇచ్చింది. పేరును కూడా టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మార్చే ప్రతిపాదన ఇందులో ఉంది.కంపెనీ ప్రయోజనాల కోసమే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్లు టాటా సన్స్ వర్గాలు తెలిపాయి. తమకున్న ‘డీమ్డ్ పబ్లిక్ కంపెనీ’ హోదాకు .. కంపెనీల చట్టం 2013 కింద గుర్తింపు లేకపోవడం వల్లే ఈ మేరకు మార్పులు తలపెట్టినట్లు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ తీర్మానం గానీ ఆమోదం పొందిన పక్షంలో.. వాటాదారులు స్వేచ్ఛగా షేర్లను విక్రయించుకోవడంపై నిర్ధిష్ట నియంత్రణలు అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం సంస్థలో గణనీయమైన వాటాలున్న మిస్త్రీ కుటుంబం.. ఆ షేర్లను బయటి ఇన్వెస్టర్లకు అమ్ముకోకుండా చెక్ చెప్పేందుకే టాటా సన్స్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్వరూపం మార్చాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మిస్త్రీ కుటుంబం భావిస్తోంది. కార్పొరేట్ స్వరూపం మార్పునకు ప్రత్యేక తీర్మానం కావాలి. దీనికి మద్దతుగా కనీసం 75 శాతం మేర షేర్‌హోల్డర్ల ఓట్లు అవసరమవుతాయి. వీటితో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర కూడా అవసరమవుతుంది.
మిస్త్రీ సంస్థల అభ్యంతరం..
టాటా సన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నందున .. అందులో గణనీయమైన వాటాలు ఉన్న మిస్త్రీల కుటుంబం తమ షేర్లను చట్టబద్ధంగా టాటాల పోటీ సంస్థలకు కూడా విక్రయించుకోవచ్చు. ఇది కంపెనీల చట్టం చెబుతున్న నిబంధన. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దాని షేర్‌హోల్డరుకు ఈ వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో.. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చే ప్రతిపాదనపై మిస్త్రీ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘మెజారిటీ షేర్ హోల్డర్లు మైనారిటీ వాటాదారులను అణచివేసేందుకు చేస్తున్న మరో ప్రయత్నమిది. దీనివల్ల టాటా సన్స్‌కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దురుద్దేశాలు, దుర్బుద్ధితోనే ఈ ఏజీఎం ఏర్పాటు చేస్తున్నారు‘ అని వ్యాఖ్యానించింది. సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థ ఈ మేరకు టాటా సన్స్ బోర్డుకు లేఖ రాసింది. టాటా సన్స్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం వల్ల షేర్లను స్వేచ్ఛగా బదలాయించుకునేందుకు వీలు లేకుండా నియంత్రణలు అమల్లోకి వస్తాయని, ఇది ఓ రకంగా మైనారిటీ వాటాదారులను మెజారిటీ షేర్‌హోల్డర్లు అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది.
సైరస్ మిస్త్రీని గతేడాది చైర్మన్‌గా తొలగించిన నేపథ్యంలో టాటా సన్స్‌తో మిస్త్రీ కుటుంబం న్యాయ పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి 18.4 శాతం వాటాలు, టాటా ట్రస్ట్స్‌కి 66 శాతం వాటాలు ఉన్నాయి.