శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా.
మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్‌డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment