Campaign programs
-
18న అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కసరత్తు పూర్తిచేసి ఈ నెల 18న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగానే లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం లోక్‌సభ ఎన్నికలకు జరగకుండా అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే త్వర లో అభ్యర్థులను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడేలోగా యాత్రలు.. ఈ నెల 20 నుంచి 17 ఎంపీ సీట్ల పరిధిలో రథ (బస్సు) యాత్రలకు జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలను మొదట ఈ నెల 10 నుంచి మొదలుపెట్టాలనుకున్నా అభ్యర్థులు ఖరారయ్యాక చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి యాత్రలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా (మూడు, నాలుగేసి సీట్లు ఒక్కో క్లస్టర్ చొప్పున) బీజేపీ జాతీయ నాయకత్వం విభజించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ యాత్రలను పూర్తిచేయడం ద్వారా మిగతా పార్టీల కంటే ముందే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసినట్లు అవుతుందని భావిస్తోంది. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున నెలాఖరుకల్లా ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే యోచనలో పార్టీ ఉంది. త్వరలోనే ఆయా క్లస్టర్లవారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్లు తెలిసింది. సంఘ్ నేతలతో కీలక భేటీ... ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ (సంస్థాగత), కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, అనంతర పరిణామాలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పరివార్ క్షేత్రాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ కొనసాగించాల్సిన సమన్వయం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా పదేళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. -
బిజీ బిజీగా గడిపేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు..!
మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు తరుముతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగం పెంచుతూ.. పెండింగ్ పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇక ప్రతీ రోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అక్కడే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో ఉరుకులు, పరుగులతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బతుకమ్మ చీరలు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారంలో కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మండలంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కకపోవడంతో జిల్లాలో మిగతా చోట్ల ఉన్న పరిస్థితి లేదు. తమకు బలం ఉన్న ప్రాంతాలతోపాటు గత ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చిన చోట ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల సీఎం బల్దియాలు, పంచాయతీలకు ప్రకటించిన ప్రత్యేక, ఇతర నిధులతో పనులు ప్రారంభిస్తున్నారు. గత నెల రోజుల్లోనే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. చెన్నూరులో వేగంగా.. జిల్లాలో మిగతా రెండు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూరులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వేగంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సుమారు రూ.312కోట్ల అభివృద్ధి పనుల కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలకు ముందే రెవెన్యూ డివిజన్, రెండు మండలాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. త్వరలోనే మంత్రి హరీశ్‌రావుతో చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి చెన్నూర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్లు, భవనాలు, పాత పనులను వేగవంతం చేయించడం, బతుకమ్మ చీరలు, క్రీడా కిట్లు, ఉచిత చేప పిల్లల పంపిణీ తదితర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. -
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
పదాధికారులు ప్రచారంలో పాల్గొనొద్దు
న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది. -
కేజ్రీవాల్.. జాతీయస్థాయి ప్రచారం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పంజాబ్‌లో అధికార పీఠంపై పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కేంద్రంలో సత్తా చాటాలని ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా జనబాహుళ్యంలోకి దూసుకెళ్లనుంది. సుపరిపాలనకు పంచ సూత్రావళిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘మేక్ ఇండియా నంబర్ వన్’ పేరిట జాతీయస్థాయి ప్రచార కార్యక్రమానికి త్రివర్ణ పతాకం ఊపి మరీ శ్రీకారంచుట్టారు. బుధవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం ఇందుకు వేదికైంది. ‘‘భారత్ ‘అభివృద్ధిచెందిన దేశం’గా అవతరించకుండా చేసి దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా మిగిల్చిన పార్టీలపై ప్రజాస్వామ్యపోరాటంలో గెలుస్తాం. అధికార పగ్గాలు ఇకపై వారికి అప్పజెప్పేదిలేదు’ అంటూ కేజ్రీవాల్ ప్రతిజ్ఞచేశారు. ‘ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రభాగాన నిలుపుదాం. అందుకు మాతోపాటు మీరంతా కలిసిరండి’ అంటూ పౌరులనుద్దేశిస్తూ ప్రసంగించారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలంటే బీజేపీ, కాంగ్రెస్.. మరే పార్టీ వారితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూనే బీజేపీ, కాంగ్రెస్‌లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘75ఏళ్ల చరిత్రలో ఈ పార్టీలు కేవలం తమ , తమ స్నేహితుల ఇళ్లను వేలకోట్ల స్థిర, చరాస్థులతో నింపేశాయి. దేశం ఇంకా వీళ్ల చేతుల్లోనే ఉంటే దేశాభివృద్ధి మరో 75 ఏళ్లు వెనకే ఉండిపోతుంది’ అని ఆరోపించారు. ‘ఈ కార్యక్రమం రాజకీయమైందికాదు. భారతజాతి కోసం చేస్తున్న ఉద్యమం’ అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఐదు సూత్రాలను తప్పక ఆచరణలో పెట్టాలన్నారు. పంచ సూత్రావళి ► ప్రతి చిన్నారికి ఉచిత, నాణ్యమైన విద్య అందించాలి ► పౌరులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం, ఔషధాలు అందివ్వాలి. ఉచితంగా పరీక్షలు చేసే రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు. ► యువతకు ఉద్యోగ కల్పన ► మహిళలకు సమాన హక్కులు, సరైన భద్రత ► రైతుల పంటకు సరైన ధర దక్కేలా చూడాలి. వారి పిల్లలు సైతం తమది రైతు కుటుంబమని గర్వపడేలా చేయాలి. లాభాల పంట పండేలా, రైతుగా కొనసాగాలనే ఆకాంక్ష వారిలో పెంచాలి. -
బీజేపీతో కరోనా పెరుగుతోంది: మమత
కోల్‌కతా: ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలోకి బీజేపీ పెద్ద ఎత్తున బయటి వ్యక్తులను తీసుకువ చ్చిందని, అందువల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పె రుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. జల్‌పయిగురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కూడా కేంద్రం సహకరించడం లేదన్నారు. మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడంపై తనకు 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడంపై స్పందిస్తూ.. ‘హిందువులు, ముస్లింలు, అందరూ ఓటేయాలని కోరడం తప్పా? ప్రతీ సభలో నన్ను అవమానిస్తున్న ప్రధాని మోదీని ప్రచారం నుంచి ఎందుకు బహిష్కరించడంలేదు?’ అని ప్రశ్నిం చారు. మమత బెనర్జీకి వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల్లో మరణించిన ఓ బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి, వారి బిడ్డను లాలిస్తున్న మమతా బెనర్జీ -
నేటి నుంచే సార్వత్రిక ఎన్నికల ప్రచార భేరి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక పోరులో నామినేషన్ల పర్వం దాదాపు పూర్తయింది. ప్రత్యర్థులెవరో తెలిసిపోయింది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఇక ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. అస్త్రశస్త్రాలతో, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సారి ప్రచార కార్యక్రమాలు ఆయా పార్టీల ముఖ్య నాయకులతో ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి జిల్లాలో ప్రచారం చేయనున్నారు . టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తెలంగాణలో ప్రచారాన్ని ఆరంభిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. వీరంతా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే జిల్లాలో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అంతకుమించి సార్వత్రిక పోరు జరగనుంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన అనేక మందిని ఆయా పార్టీలు బుజ్జగించి ఉపసంహరించుకునేలా చేశాయి. వారు తమకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు అభ్యర్థులు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రచార ప్రారంభానికి ఆయా పార్టీల ముఖ్యనేతలు వస్తున్న దరిమిలా రోడ్‌షోలకు, సభలకు అధిక మొత్తంలో జనాలను తీసుకొచ్చేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో కొత్తు ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు. జిల్లాపైనే అధినేతల గురి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రంగారెడ్డి జిల్లా కీలకం కానుంది. ఇక్కడ సెటిలర్లు అధికంగా నివసిస్తున్నందున ప్రధాన పార్టీలన్నీ ఇక్కడే దృష్టి కేంద్రీకరించాయి.