న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment