Office bearers
-
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్‌దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
పదాధికారులు ప్రచారంలో పాల్గొనొద్దు
న్యూఢిల్లీ: రెండు వారాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను కాంగ్రెస్ పార్టీ వెలువరించింది. ‘ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పదాధికారులు(ఆఫీస్ బేరర్లు) తమ పదవికి రాజీనామా చేయాలి. పార్టీ ప్రతినిధులు(డెలిగేట్స్) తమకు నచ్చిన అభ్యర్థికి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటు వేయవచ్చు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీలో పలు విభాగాల అధ్యక్షులు, పార్టీ సెల్స్‌లో ఉన్న వారు, అధికార ప్రతినిధులు... అభ్యర్థికి అనుకూలంగా/వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ప్రచారం చేయాలనుకుంటే ముందుగా పార్టీలో మీ పదవికి రాజీనామా చేయండి’ అని పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార విభాగం మార్గదర్శకాల్లో పేర్కొంది. అభ్యర్థులు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నపుడు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు మర్యాదపూర్వకంగా కలవవచ్చని స్పష్టంచేసింది. ‘ప్రచారానికి సంబంధించిన సమావేశ మందిరాలు, చైర్లు, ప్రచార ఉపకరణాలు సమకూర్చవచ్చు. డెలిగేట్స్‌ను ఓటింగ్ స్థలానికి వాహనాల్లో తరలించకూడదు. మార్గదర్శకాలను మీరితే చర్యలు తప్పవు’ అని పార్టీ పేర్కొంది. -
టీపీసీసీ ప్రక్షాళన.. కదలని నేతలు అవుట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో వరుసగా ఓటములు, అంతర్గత కుమ్ములాటలు, పదవులు కట్టబెట్టినా కదలని తీరు, ఒకరిపై మరొకరి ఫిర్యాదులతో గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కీలక పదవుల్లో కూర్చోబెట్టినా అందుకు తగ్గ పనితీరు చూపని నేతలను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు, వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ప్రక్షాళన ఉండనున్నట్టు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. పదవులిచ్చినా ఫలితం లేక.. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పీసీసీలో కీలక మార్పులు చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. గత ఏడాది జూన్‌లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరితోపాటు ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలను ప్రకటించింది. ఆ తర్వాత సీనియర్ నేతల అభిప్రాయం మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ, చేరికల కమిటీలనూ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పార్టీ విధేయత ఆధారంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇంతమందికి బాధ్యతలు కట్టబెట్టినా.. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఐదువేల ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో రేవంత్‌కు పీసీసీ పదవి కట్టబెట్టడం నచ్చని సీనియర్లు చాలామంది బహిరంగ విమర్శలకు దిగారు. దీనిపైనా అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. స్వయంగా రాహుల్‌గాంధీ జోక్యం చేసుకున్నా కొందరు విమర్శలు ఆపడం లేదని, కీలక బాధ్యతల్లోని నేతలు పార్టీ కార్యక్రమాలను విస్మరించడంతోపాటు పార్టీ పటిష్టానికి చొరవ చూపడం లేదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. దూతలు అందించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ఆరుగురు ఆఫీసు బేరర్ల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరిని త్వరలోనే పక్కనపెడతారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిపై పదే పదే విమర్శలు గుప్పించే ఒకరిద్దరికి ఉద్వాసన తప్పకపోవచ్చని వినిపిస్తోంది. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశాలున్నాయి. కీలక పదవుల్లో ఉన్న నేతల పనితీరును మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షించాక ప్రక్షాళన దిశగా ప్రియాంకగాంధీ నిర్ణయాలు తీసుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. పనితీరుపై నివేదికలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో నేరుగా పోరాడే సత్తా కాంగ్రెస్‌కు లేదని, అది బీజేపీతోనే సాధ్యమన్న తరహా ప్రచారం పెరుగుతోంది. దీనిని ఎదుర్కొని, తామే ప్రత్యామ్నాయమని చాటేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర అధ్యక్షుడు మినహా కీలక పదవుల్లోని కొందరు నేతలు శ్రద్ధ పెట్టడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక దూతలు, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, బోసురాజులతోపాటు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు ఆయా నేతల పనితీరుపై ప్రియాంకకు నివేదికలు ఇచ్చారు. పదిహేను రోజుల కింద ప్రియాంకతో వీరు భేటీ అయినప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సుమారు పది మంది నేతలను పక్కనపెట్టి, ఆ స్థానాల్లో ఉత్సాహవంతులను నియమించాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల! -
ఈనెల 31న భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఎన్నికలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వస్తోన్న భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 31, నవంబర్ 1వ తేదీల్లో ఏఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తారు. అందులో భాగంగా తొలి రోజు జరిగే సమావేశంలో ఎన్నికలు నిర్వహించి ఆఫీస్ బేరర్లను ఎన్నుకొనేందుకు సిద్ధమయ్యామని ఏఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎన్నికైన వారు 2024 వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగిసింది. అయితే కరోనా కారణంతో ఎన్నికలను నిర్వహించలేమంటూ... వారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏఎఫ్ఐ మే నెలలో నిర్ణయం తీసుకుంది. -
ఆ కమిటీల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ఆఫీస్ బేరర్స్, డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి ఊమెన్ చాందీ చైర్మన్‌గా ఉంటారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది. మొత్తంగా చూస్తే మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. (చదవండి: వచ్చే నెలలో రాయపాటి ఆస్తుల వేలం) డిసీసీ అధ్యక్షులు వీరే 1. శ్రీకాకుళం: బొడ్డెపల్లి సత్యవతి 2. విజయనగరం: సారగడ్డ రమేశ్‌కుమార్ 3. అనకాపల్లి: శ్రీరామమూర్తి 4. కాకినాడ(రూరల్): డాక్టర్ పాండురంగారావు 5. అమలాపురం: కొట్టూరి శ్రీనివాస్ 6. రాజమండ్రి(రూరల్): ఎన్వీ శ్రీనివాస్ 7. నరసాపురం: మారినేడి శేఖర్ (బాబ్జి) 8. ఏలూరు (రూరల్): జెట్టి గురునాథం 9. మచిలీపట్నం: లామ్ తానియా కుమారి 10. విజయవాడ(రూరల్): కిరణ్ బొర్రా 11. నర్సరావుపేట: జి. అలెగ్జాండర్ సుధాకర్ 12. ఒంగోలు (రూరల్): ఈదా సుధాకరరెడ్డి 13. నంద్యాల: లక్ష్మీనరసింహరెడ్డి 14. కర్నూలు(రూరల్): అహ్మద్ అలీఖాన్ 15. అనంతపురం(రూరల్): ఎస్. ప్రతాపరెడ్డి 16. హిందూపురం: కె. సుధాకర్ (మాజీ ఎమ్మెల్యే) 17. నెల్లూరు (రూరల్): దేవకుమార్‌రెడ్డి 18. చిత్తూరు: డాక్టర్ సురేశ్‌బాబు -
ఏఐఏడీఎంకే నుంచి 58మంది బహిష్కరణ
చెన్నై: అన్నా డీఎంకే పార్టీ నుంచి 50మందికిపైగా నాయకులను పార్టీ అధినాయకులు ఒ.పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామిలు బహిష్కరించారు. క్రమశిక్షణ వేటు పడిన 53మంది పార్టీ కాంచీపురం సెంట్రల్ యూనిట్‌కు చెందినవారు. అలాగే పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగానికి చెందిన ఐదుగురు(అన్నా తోజిర్సంగ పెరవై)ని కూడా బహిష్కరించారు. వారిని అన్ని పోస్టుల నుంచి, ప్రాథమిక సభ్యత్వాల నుంచి తొలగించినట్లు కో ఆర్డినేటర్లు పన్నీరుసెల్వం, పళనిస్వామిలు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన దినకరన్‌కు ప్రధాన శక్తులుగా ఉన్న పలువురిని ఇంతకుముందు కూడా బహిష్కరించారు. -
వైసీపీ అనుబంధ విభాగాలకు ఆఫీస్ బేరర్లు
సాక్షి, హైదరాబాద్: వైసీపీ యువజన, విద్యార్థి, మైనారిటీ ఆంధ్రప్రదేశ్ విభాగాలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపట్టారు. పార్టీ ఏపీ విద్యార్థి విభాగం అడ్హాక్ కమిటీ అధ్యక్షుడుగా షేక్ సలాంబాబు (కడప), ప్రధాన కార్యదర్శిగా రెడ్డిగారి రాకేష్‌రెడ్డి (కర్నూలు), ఏపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా భవనం భూషణ్ (గుంటూరు), ఎన్.హరీష్‌కుమార్ (కడప), మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఐహెచ్ ఫరూఖీ (విశాఖపట్టణం) నియమితులైనట్లు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫరూఖీ ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పార్టీ మైనారిటీ విభాగం వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. -
కొత్త వారసుడిపై కసరత్తు షురూ
బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర హోం మంత్రి పదవి దక్కడంతో.. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో చర్చలు జరిపిన రాజ్‌నాథ్.. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇదంతా బుధవారం ఉదయమే పూర్తి కావడం గమనార్హం. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండటం బీజేపీ నియమ నిబంధనలకు విరుద్ధం కావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను వేగవంతం చేశారు. కొత్త అధ్యక్షుడిగా జేపీ నద్దా (54) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతోపాటు.. మోడీ మంత్రివర్గంలో కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిచంకపోవడంపై కూడా రాజ్‌నాథ్, ఆర్ఎస్ఎస్ వర్గాల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బీజేపీకి భారీ ఆధిక్యం లభించినా.. మంత్రివర్గంలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం అంతంతే. రాజస్థాన్ నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కగా, మిగిలిన రెండు రాష్ట్రాలకు ఒక్కటీ రాలేదు. రాబోయే కొద్ది వారాల్లో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ కార్యవర్గంలో కూడా చాలామంది ప్రభుత్వంలో చేరడంతో కార్యవర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్, థావర్ చంద్ గెహ్లాట్ కూడా కేంద్ర మంత్రులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ, జువల్ ఓరమ్, కోశాధికారి పీయూష్ గోయల్‌లను కూడా మంత్రి పదవులు వరించాయి. అధికార ప్రతినిధులు నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్ సైతం కేబినెట్లో చేరారు. ఈ అందరి స్థానాల్లో కొత్తవారిని నియమించాల్సి ఉంది. -
‘గుర్తింపు’ కార్డు తప్పనిసరి
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో ఏర్పడిన అంతర్గత నాయక సమస్యపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈనెల 23వ తేదీన గోదావరిఖనిలో ఏర్పాటు చేసే జనరల్ బాడీ సమావేశంలో ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ బుధవారం ఇక్కడికి వచ్చారు. స్థానిక సింగరేణి స్టేడియం, సెయింట్‌పాల్ హైస్కూల్, గంగానగర్ పాఠశాల, సింగరేణి కమ్యూనిటీ హాల్, టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్, ఆర్‌సీఓఏ క్లబ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 23న జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో పాల్గొననున్న కార్మికుల కు ఇబ్బందులు తలెత్తకుండా గోదావరిఖని లో అనుకూలంగా ఉండే పలు ప్రాంతాలను పరిశీలించామని, మొత్తం 25 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. ఈ ఎన్నికలకు రెవెన్యూ అధికారులను ఉపయోగిస్తున్నామని, వారికి ఈనెల 21వ తేదీన శిక్షణ ఇస్తామన్నారు. పోలీస్ సిబ్బం దిని ఎక్కువగా ఉపయోగించనున్నామని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో సంప్రదిస్తామ ని తెలిపారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక లు నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించకుండా హైకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నా రు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చంతా యూనియన్ ఖాతా నుంచి వాడనున్నామ ని, ఈ విషయాన్ని పోటీలో పడుతున్న ఇరువర్గాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. కొందరు నాయకులు గనులపైనే ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది.. కార్మికులను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు. చెక్ఆఫ్ సిస్టమ్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకా రం గుర్తింపు యూనియన్ యాజమాన్యాని కి ఇచ్చిన నివేదిక ప్రకారం 40,752 మంది ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఇందులో గుర్తింపు యూనియన్‌కు చందా చెల్లిస్తున్నట్లు కార్మికులు సైతం రాత పూర్వకంగా రాసి ఇచ్చారు.. వీరు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది శాంతి భద్రతల సమస్యగా దారి తీస్తుంది.. తమ పరిధులు దాటి ఏ వర్గం వారైనా ఈ ప్రయత్నానికి పూనుకుంటే వారిపై హైకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇరు వర్గాలు సహకరించాలి కోరారు. కార్మికులు యాజమాన్యం ఇచ్చిన ‘గుర్తింపు’ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. ఆర్ఎల్సీ వెంట ఏఎల్సీ ఆర్సీ సాహు, లేబర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పి.లక్ష్మణ్, వీకే ఖరే, నర్సయ్య, సింగరేణి పర్సనల్ జీఎం మల్లయ్యపంతులు, సెక్యూరిటీ జీఎం శివరామిరెడ్డి, అనిల్‌కుమార్, కె.ప్రకాశ్‌బాబు, అమానుల్లా తదితరులున్నారు.