కొత్త వారసుడిపై కసరత్తు షురూ
బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు కేంద్ర హోం మంత్రి పదవి దక్కడంతో.. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో చర్చలు జరిపిన రాజ్నాథ్.. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఇదంతా బుధవారం ఉదయమే పూర్తి కావడం గమనార్హం. ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండటం బీజేపీ నియమ నిబంధనలకు విరుద్ధం కావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికను వేగవంతం చేశారు. కొత్త అధ్యక్షుడిగా జేపీ నద్దా (54) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
దీంతోపాటు.. మోడీ మంత్రివర్గంలో కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిచంకపోవడంపై కూడా రాజ్నాథ్, ఆర్ఎస్ఎస్ వర్గాల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బీజేపీకి భారీ ఆధిక్యం లభించినా.. మంత్రివర్గంలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం అంతంతే. రాజస్థాన్ నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కగా, మిగిలిన రెండు రాష్ట్రాలకు ఒక్కటీ రాలేదు. రాబోయే కొద్ది వారాల్లో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ కార్యవర్గంలో కూడా చాలామంది ప్రభుత్వంలో చేరడంతో కార్యవర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు అనంతకుమార్, ధర్మేంద్ర ప్రధాన్, థావర్ చంద్ గెహ్లాట్ కూడా కేంద్ర మంత్రులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ, జువల్ ఓరమ్, కోశాధికారి పీయూష్ గోయల్లను కూడా మంత్రి పదవులు వరించాయి. అధికార ప్రతినిధులు నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్ సైతం కేబినెట్లో చేరారు. ఈ అందరి స్థానాల్లో కొత్తవారిని నియమించాల్సి ఉంది.