లక్నో: దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ బ్రిటిష్ చరిత్రకారుడు థామస్ బాబింగ్టన్ మెకాలే కుట్రలో భాగమని, ఒక
నిర్ధేశిత విధానంలో మనం బంధింపబడ్డామని, దాని నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. విద్యావ్యవస్థలో మాతృభాషకు ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. లక్నోలోని జైపూరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 18వ స్నాతకోత్సవంలో రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం అత్యుత్తమమైనదైతే స్వాతంత్య్రం సాధించి 67 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ప్రపంచంలోని 275 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, 100 అత్యత్తమ సాంకేతిక విద్యాసంస్థల్లో మనదేశానికి చెందిన ఒక్క సంస్థ కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు.
ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమైనా మాతృభాషలో సంభాషించకుండా అందరూ ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. దీని వల్లే హిందీలో మాట్లాడటాన్ని పోత్సహించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని, అయితే ఇది ఇతర భాషలను వ్యతిరేకించడం కాదని చెప్పుకొచ్చారు. విదేశీయులు మన నుంచే అంతా నేర్చుకున్నారని, బ్రిటిష్ వారి ప్రవేశం తర్వాత విజ్ఞానం అనేది పాశ్చాత్య దేశాల సొత్తుగా భావించేలా ఒక మానసికస్థితికి మనల్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాగా, రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం మొనాకో, ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానితో సమావేశమై వివిధ రంగాల్లో సాంకేతిక సహకారంపై చర్చించనున్నారు.