సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో వరుసగా ఓటములు, అంతర్గత కుమ్ములాటలు, పదవులు కట్టబెట్టినా కదలని తీరు, ఒకరిపై మరొకరి ఫిర్యాదులతో గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కీలక పదవుల్లో కూర్చోబెట్టినా అందుకు తగ్గ పనితీరు చూపని నేతలను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు, వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ ప్రక్షాళన ఉండనున్నట్టు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి.
పదవులిచ్చినా ఫలితం లేక..
హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పీసీసీలో కీలక మార్పులు చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. గత ఏడాది జూన్‌లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వీరితోపాటు ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలను ప్రకటించింది. ఆ తర్వాత సీనియర్ నేతల అభిప్రాయం మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ, చేరికల కమిటీలనూ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పార్టీ విధేయత ఆధారంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇంతమందికి బాధ్యతలు కట్టబెట్టినా.. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఐదువేల ఓట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో రేవంత్‌కు పీసీసీ పదవి కట్టబెట్టడం నచ్చని సీనియర్లు చాలామంది బహిరంగ విమర్శలకు దిగారు. దీనిపైనా అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. స్వయంగా రాహుల్‌గాంధీ జోక్యం చేసుకున్నా కొందరు విమర్శలు ఆపడం లేదని, కీలక బాధ్యతల్లోని నేతలు పార్టీ కార్యక్రమాలను విస్మరించడంతోపాటు పార్టీ పటిష్టానికి చొరవ చూపడం లేదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
దూతలు అందించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ఆరుగురు ఆఫీసు బేరర్ల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరిని త్వరలోనే పక్కనపెడతారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిపై పదే పదే విమర్శలు గుప్పించే ఒకరిద్దరికి ఉద్వాసన తప్పకపోవచ్చని వినిపిస్తోంది. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశాలున్నాయి. కీలక పదవుల్లో ఉన్న నేతల పనితీరును మరోమారు పూర్తిస్థాయిలో సమీక్షించాక ప్రక్షాళన దిశగా ప్రియాంకగాంధీ నిర్ణయాలు తీసుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి.
పనితీరుపై నివేదికలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో నేరుగా పోరాడే సత్తా కాంగ్రెస్‌కు లేదని, అది బీజేపీతోనే సాధ్యమన్న తరహా ప్రచారం పెరుగుతోంది. దీనిని ఎదుర్కొని, తామే ప్రత్యామ్నాయమని చాటేందుకు చేయాల్సిన కృషిపై రాష్ట్ర అధ్యక్షుడు మినహా కీలక పదవుల్లోని కొందరు నేతలు శ్రద్ధ పెట్టడం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక దూతలు, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, బోసురాజులతోపాటు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు ఆయా నేతల పనితీరుపై ప్రియాంకకు నివేదికలు ఇచ్చారు. పదిహేను రోజుల కింద ప్రియాంకతో వీరు భేటీ అయినప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సుమారు పది మంది నేతలను పక్కనపెట్టి, ఆ స్థానాల్లో ఉత్సాహవంతులను నియమించాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది.
ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
Comments
Please login to add a commentAdd a comment