![Telangana Pradesh Congress Chief Revanth Reddy TPCC - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/27/Revanth-reddy.jpg.webp?itok=rqCQ8MwG)
కాంగ్రెస్ ఎప్పుడూ విశిష్టమైన వ్యక్తులనే ఎంపిక చేసుకుంటుంది. ఆ విశిష్టమైన వ్యక్తులతో పార్టీలో అప్పటికే ఉన్న అతి విశిష్టులు విభేదిస్తూ ఉండొచ్చు గాక. కోపంగా వెళ్లి వేరే పార్టీలో చేరొచ్చు గాక. కాంగ్రెస్ తన విశిష్టతను చేజార్చుకోదు.
శశిధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు.. ‘అయ్యో, ఊడల మర్రి.. వేళ్లు పెకిలించుకుందా..’ అని కాంగ్రెస్ ఏమీ హుటాహుటిన ఢిల్లీలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్‌ను మించిన మహామర్రి దేశంలో ఎక్కడైనా ఉందా.. తెలంగాణలో ఉండటానికి?!
స్కూల్లో ఉన్నప్పుడు ఆర్.ఎస్.ఎస్. ఆకర్షిస్తుంది. ఆకర్షించేది ఆర్.ఎస్.ఎస్. కాదు. ఆర్.ఎస్.ఎస్. చేతిలోని ఆ పొడవాటి కర్ర . కాలేజ్‌లో ఉన్నప్పుడు రాడికల్స్ ఆకర్షిస్తారు. ఆకర్షించేది రాడికల్స్ కాదు. వారి భుజాలకు వేలాడే ఆ పొడవాటి తుపాకీ. భ్రమలన్నీ తొలగిపోయాక ఆకర్షించేది కాంగ్రెస్. కాంగ్రెస్ చేతిలో కర్రా ఉండదు, కాంగ్రెస్ భుజానికి తుపాకీ ఉండదు. అయినా ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి తను ఎంపిక చేసుకున్న విశిష్టమైన వ్యక్తులే ఆయుధాలు! ఆయుధం పేరు ఖర్గే కావచ్చు, రేవంత్‌రెడ్డి కావచ్చు. పదును మాత్రం పార్టీదే. వ్యక్తిగా ఎదగాలని అనుకున్న వాళ్లే పార్టీని వదిలి వెళ్తారు.
బీజేపీలో చేరడం కోసం శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి ముందు రోజు నేను ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ఖర్గే పిలిపించారని చెబితే ఖర్గే కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను.
‘‘ఎంతసేపైంది రేవంత్ గారూ మీరు వచ్చి?’’ అనే మాట వినిపించి అటు వైపు చూశాను. మాణిక్కం ఠాగూర్! తెలంగాణ స్టేట్ ఇంచార్జ్. ఆయన వెనకే బోసు రాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్ వచ్చారు. వాళ్లు ముగ్గురూ తెలంగాణ స్టేట్‌ను, తెలంగాణ స్టేటస్‌ను చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు.
మాణిక్కం ఠాగూర్ తమిళనాడు. బోసు రాజు కర్ణాటక, రోహిత్ చౌదరి ఢిల్లీ, నదీమ్ జావెద్ యూపీ. నలుగురూ నాతో చాలా ఆత్మీయంగా ఉన్నారు. నేను పార్టీలోకి వచ్చి ఐదేళ్లయింది. తెలంగాణలో ఒక్క సీనియర్ కూడా నాతో ఇంత ఆత్మీయంగా లేరు!
‘‘శశి థరూర్‌రెడ్డి అలా సడన్‌గా పార్టీకి రిజైన్ చేసి ఎందుకు వెళ్లిపోయారు రేవంత్?’’ అని అడిగారు రోహిత్ చౌదరి!
శశి థరూర్‌రెడ్డి కాదు, శశిధర్‌రెడ్డి అని రోహిత్ చౌదరిని సరిదిద్దినందు వల్ల.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక నేను ఆ ప్రయత్నం మానుకున్నాను.
‘‘రేవంత్ గారూ! మీరు పార్టీలో పెద్దల్ని గౌరవించడం లేదట! హనుమంతరావు గారిని గోడకేసి కొడతానన్నారట! స్టార్ క్యాంపెయినర్ వెంకట్‌రెడ్డి గారిని హోమ్ గార్డ్ అన్నారట!’’ అని అడిగారు బోసు రాజు.
నేను ఎవర్ని ఏం అనినా పార్టీ కోసమే అన్నాను అని చెప్పినందు వల్ల హనుమంత రావుకి గానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గానీ కనువిప్పు కలిగి వారు నాతో కలిసి పనిచేసేది ఉండదు కనుక నేనేమీ మాట్లాడలేదు.
‘‘రాజగోపాల్ రెడ్డిని పూర్తి పేరుతో ఎవరూ పిలవొద్దు, ఆర్.జి.పాల్ అనండి చాలు అని పార్టీ క్యాడర్‌కి మీరు పిలుపునిచ్చారట..’’ అన్నారు నదీమ్ జావెద్.
కేఏ పాల్‌తో పోల్చినందుకు ఆర్.జి.పాల్ అప్‌గ్రేడ్ అయినట్లు ఫీల్ అవాలి గానీ, అందులో డీగ్రేడ్ అవడానికి ఏముందీ అని అనబోయి, కేఏ పాల్‌పై హై కమాండ్‌కు అనవసరంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసినట్లవుతుందని ఆగిపోయాను.
‘‘గుడ్’’ అన్నారు మాణిక్కం ఠాగూర్! అంతకుమించి ఆయనేం మాట్లాడలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాక మాణిక్కం ఠాగూర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
‘‘రేవంతు గారూ.. కంగ్రాట్స్.. ఖర్గేజీ మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు..’’ అని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment