వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోతపై మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాడీవేడిగా జరిగింది. సీనియర్ నేతలు కొందరు పలు అంశాలపై సందేహాల పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన ఆశావహుల జాబితాలో పేర్లు తప్ప ఎలాంటి సమాచారం లేకపోవడంపై జానారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలేవీ లేకుండా కేవలం జాబితా ఇచ్చేసి టిక్కులు పెట్టమంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ టికెట్ల అంశంపై సీనియర్ నేతల మధ్య వాగి్వవాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీఈసీ వడపోత కార్యక్రమాన్ని సెపె్టంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఆ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాం«దీభవన్‌లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలరాం నాయక్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సునీతారావ్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావు, మిద్దెల జితేందర్‌లు పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారులో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి, ఇతర పారీ్టలతో పొత్తులు తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు.
పేర్లిస్తే సరిపోతుందా?
విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులందరికీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున టిక్ చేయాలని కోరారు. అయితే జాబితాలో కేవలం పేర్లు మాత్రమే ఉండటంపై జీవన్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నాల తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు? అనే వివరాలు కూడా లేకుండా అభ్యర్థులను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఆశావహుల సీనియార్టీ, పారీ్టలో హోదా, పూర్వ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవ, కులం లాంటి వివరాలేవీ లేకుండా కేవలం పేర్లు చూసి టిక్ పెట్టాలంటే ఎలా పెడతామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి, పొన్నాల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల విశ్లేషణ లేకుండా, ఏ ప్రాతిపదికన ఏ కులానికి టికెట్లు ఎన్ని ఇవ్వాలో నిర్ధారించకుండా, ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల ఓటర్లను అంచనా వేయకుండా టిక్కులు చేయడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నించారు. ఆశావహుల పూర్తి వివరాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సామాజిక వివరాలు ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర సర్వే వివరాలను కానీ, ఇప్పటికే ఏఐసీసీకి పంపిన వివరాలను కానీ జత చేయాలని పొన్నాల సూచించారు.
యూత్‌కు ఎన్ని టికెట్లు?
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చే టికెట్లను తొలి జాబితాలోనే ప్రకటించాలని అన్నారు. నియోజకవర్గాల్లో పని చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, ఎన్నికల్లో అన్ని విధాలా వారికి సాయం చేయాలని సూచించారు. యువకులకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే పక్షంలో తన కుమారుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేస్తున్నందున తనతో పాటు తన కుమారుడికి అవకాశం కలి్పంచాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కోరారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని వీహెచ్, మహిళలకు తగిన అవకాశాలు కలి్పంచాలని రేణుకా చౌదరి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని, సెప్టెంబర్ 2న మరోమారు సమావేశమై అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించి వడపోత చేపట్టాలని పీఈసీ నిర్ణయించింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలనే అంశాలపై వచ్చే నెల 2న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని పీఈసీ నిర్ణయించింది.
బీఆర్‌ఎస్‌కు కౌంటర్ వ్యూహం ఉండాలి
బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిపోయిందని, దళిత బంధు లాంటి పథకాల ద్వారా కొత్తగా నియోజకవర్గానికి మరో 10 వేల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటోందని, ఈ ఓటు బ్యాంకును కౌంటర్ చేసేలా పార్టీ వ్యూహం ఉండాలని, వీలున్నంత త్వరగా అభ్యర్థుల వడపోత ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పినట్లు సమాచారం. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తొలి జాబితా: మహేశ్‌కుమార్‌గౌడ్
సమావేశానంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్టు చెప్పారు. దరఖాçస్తుదారుల అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించేందుకు సెపె్టంబర్ 2న పీఈసీ మరోమారు సమావేశమవుతుందని తెలిపారు. 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని స్థాయిల్లోని నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని చెప్పారు. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారి పేర్లు ఉండాలని పీఈసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పొత్తు పొరపాట్లు చేయొద్దు
ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్‌తో పాటు ఇతర పారీ్టలతో పొత్తుల అంశంపై కూడా పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ‘గతంలో లాగా ఒక పార్టీ నుంచి ఇంకో పారీ్టకి ఓట్ల బదిలీ జరగడం లేదు. మనం పొత్తుల పేరుతో వెళ్లి సీట్లు త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అని వారు చెప్పినట్టు తెలిసింది.
60 చోట్ల భారీగా దరఖాస్తులు
కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిస్తే.. 60 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 45 నియోజకవర్గాల్లో 10 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 5 నియోజకవర్గాల్లో 9 చొప్పున, 10 నియోజకవర్గాల్లో 8 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, జగిత్యాలలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా, మిగిలిన చోట్ల 2 నుంచి 7 వరకు వచ్చాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 32 దరఖాస్తులు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment