కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ప్రాతినిధ్యం లభిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్లీనరీ అనంతరం ఏర్పాటు చేయనున్న సీడబ్ల్యూసీలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న టి.సుబ్బిరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్)తోపాటు తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే, సుబ్బిరామిరెడ్డికి మళ్లీ రెన్యువల్ అవుతుందని, మిగిలిన నేతలకు సీడబ్ల్యూసీలో చోటు దక్కే అవకాశం లేదని 10 జన్‌పథ్ వర్గాలు చెబుతున్నాయి.
కోమటిరెడ్డితో పాటు పలువురు
సీడబ్ల్యూసీ సభ్యత్వం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దగా డిమాండ్ కనిపించకపోయినా తెలంగాణ నుంచి నలుగురైదుగురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. తనకు సీడబ్ల్యూసీ అవకాశం తప్పకుండా వస్తుందని, సీడబ్ల్యూసీ సభ్యుని హోదాలోనే పాదయాత్రను ప్రారంభిస్తాననే ధీమాతో ఉన్నారు. సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య కూడా సీడబ్ల్యూసీలో స్థానాన్ని ఆశిస్తున్నారు.
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి పేరు నాలుగైదు నెలలుగా వినిపిస్తోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగితే తాను పోటీచేసి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సభ్యుల ఓట్లతో గెలుపొందాలని ఆయన భావించారు. కానీ సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నిక ద్వారా కాకుండా ఏఐసీసీ చీఫ్ ఎంపిక చేయాలని ప్లీనరీలో నిర్ణయించడంతో ఇప్పుడు తనను ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి పేరు వినిపిస్తోంది.
ఆయనతోపాటు తెలంగాణలోని ఏఐసీసీ కార్యదర్శుల్లో ఒకరికి ప్రమోషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇతర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా న్యాయం చేయలేమని, రాష్ట్రంలోనే ఉండాల్సి వస్తుందని కొందరు సీనియర్ నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment