చెన్నూర్‌లో క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామగ్రి అందజేస్తున్న విప్ సుమన్
మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు తరుముతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగం పెంచుతూ.. పెండింగ్ పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇక ప్రతీ రోజు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.
అక్కడే సభలు, సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లో ఉరుకులు, పరుగులతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బతుకమ్మ చీరలు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారంలో కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు.
మండలంలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ దక్కకపోవడంతో జిల్లాలో మిగతా చోట్ల ఉన్న పరిస్థితి లేదు. తమకు బలం ఉన్న ప్రాంతాలతోపాటు గత ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చిన చోట ఇప్పటివరకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇటీవల సీఎం బల్దియాలు, పంచాయతీలకు ప్రకటించిన ప్రత్యేక, ఇతర నిధులతో పనులు ప్రారంభిస్తున్నారు. గత నెల రోజుల్లోనే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి.
చెన్నూరులో వేగంగా..
జిల్లాలో మిగతా రెండు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూరులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వేగంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రి కేటీఆర్‌తో సుమారు రూ.312కోట్ల అభివృద్ధి పనుల కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలకు ముందే రెవెన్యూ డివిజన్, రెండు మండలాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
త్వరలోనే మంత్రి హరీశ్‌రావుతో చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి చెన్నూర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్లు, భవనాలు, పాత పనులను వేగవంతం చేయించడం, బతుకమ్మ చీరలు, క్రీడా కిట్లు, ఉచిత చేప పిల్లల పంపిణీ తదితర కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment