సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కసరత్తు పూర్తిచేసి ఈ నెల 18న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగానే లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం లోక్‌సభ ఎన్నికలకు జరగకుండా అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే త్వర లో అభ్యర్థులను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ వెలువడేలోగా యాత్రలు..
ఈ నెల 20 నుంచి 17 ఎంపీ సీట్ల పరిధిలో రథ (బస్సు) యాత్రలకు జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలను మొదట ఈ నెల 10 నుంచి మొదలుపెట్టాలనుకున్నా అభ్యర్థులు ఖరారయ్యాక చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి యాత్రలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా (మూడు, నాలుగేసి సీట్లు ఒక్కో క్లస్టర్ చొప్పున) బీజేపీ జాతీయ నాయకత్వం విభజించింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ యాత్రలను పూర్తిచేయడం ద్వారా మిగతా పార్టీల కంటే ముందే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసినట్లు అవుతుందని భావిస్తోంది. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున నెలాఖరుకల్లా ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే యోచనలో పార్టీ ఉంది. త్వరలోనే ఆయా క్లస్టర్లవారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్లు తెలిసింది.
సంఘ్ నేతలతో కీలక భేటీ...
ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ (సంస్థాగత), కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, అనంతర పరిణామాలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పరివార్ క్షేత్రాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ కొనసాగించాల్సిన సమన్వయం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా పదేళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment