సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక పోరులో నామినేషన్ల పర్వం దాదాపు పూర్తయింది. ప్రత్యర్థులెవరో తెలిసిపోయింది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఇక ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. అస్త్రశస్త్రాలతో, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సారి ప్రచార కార్యక్రమాలు ఆయా పార్టీల ముఖ్య నాయకులతో ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి జిల్లాలో ప్రచారం చేయనున్నారు
. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి తెలంగాణలో ప్రచారాన్ని ఆరంభిస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. వీరంతా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే జిల్లాలో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అంతకుమించి సార్వత్రిక పోరు జరగనుంది.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన అనేక మందిని ఆయా పార్టీలు బుజ్జగించి ఉపసంహరించుకునేలా చేశాయి. వారు తమకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు అభ్యర్థులు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రచార ప్రారంభానికి ఆయా పార్టీల ముఖ్యనేతలు వస్తున్న దరిమిలా రోడ్‌షోలకు, సభలకు అధిక మొత్తంలో జనాలను తీసుకొచ్చేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో కొత్తు ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు.
జిల్లాపైనే అధినేతల గురి
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రంగారెడ్డి జిల్లా కీలకం కానుంది. ఇక్కడ సెటిలర్లు అధికంగా నివసిస్తున్నందున ప్రధాన పార్టీలన్నీ ఇక్కడే దృష్టి కేంద్రీకరించాయి.