ఆ బిల్లుకు ఆమోదం తెలపకండి
గవర్నర్‌తో సమావేశమైన మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) విభజన బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేస్తే ఇక బీబీఎంపీ విభజన ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని దేవేగౌడ శుక్రవారమిక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాతో సమావేశమయ్యారు.
బీబీఎంపీ విభజన బిల్లు ఇప్పటికే గవర్నర్‌కు చేరిన నేపథ్యంలో ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలపవద్దని దేవేగౌడ గవర్నర్ వజుభాయ్ వాలాను కోరారు. సమావేశం అనంతరం దేవేగౌడ విలేకరులతో మాట్లాడుతూ...‘బీబీఎంపీ విభజన బిల్లుపై గవర్నర్ సంతకం చేసేస్తే ఇక బీబీఎంపీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, బీబీఎంపీ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇది రాజ్యాంగంలోని 74వ సెక్షన్‌కు విరుద్ధం. ఇదే విషయాన్ని గవర్నర్‌కు వివరించారు.
గవర్నర్ వజుభాయ్ వాలా చాలా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంలో లోకాయుక్త(సవరణ) బిల్లు పై సైతం గవర్నర్‌తో చర్చించాను’ అని వెల్లడించారు.