బెంగళూరు: ప్రస్తుత న్యాయ వ్యవస్థలో సామాన్యులకు కోర్టుల్లో సరైన న్యాయం దొరకడం లేదని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలా పేర్కొన్నారు. కాలం చెల్లిన, అశాస్త్రీయ బ్రిటీష్ విధానాలను పాటిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేవారు. స్థానిక జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాచరికం ఉన్నప్పుడు సామాజిక, భౌగోళిక, ఆర్థిక తదితర పరిస్థితులను అనుసరించి ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేక న్యాయసూత్రాలు ఉండేవన్నారు. ప్రస్తుతం దేశంలో న్యాయ సూత్రాల కంటే అప్పటి విధానాల్లో అధిక శాతం ఉత్తమమైనవన్నారు. అయితే బ్రిటీష్ హయాంలో దేశమంతటికీ ఒకే న్యాయ వ్యవస్థ ఉండండాలనే ఉద్దేశంతో ‘కోర్ట్ ఆఫ్ లా’ తీసుకువచ్చినా దీని వల్ల సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. సాక్ష్యాలు, న్యాయవాది వాద పటిమను అనుసరించే చాలా కేసులకు సంబంధించి కోర్టులో తీర్పులు వెలువడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు సరైన న్యాయం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించారు.
అందువల్ల న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రస్తుత విధానంలో ప్రభుత్వం విభాగాలకు సామాన్యుడికి మధ్య జరుగుతున్న చాలా కేసుల్లో విచారణ చాలా ఏళ్ల పాటు సాగుతోందన్నారు. అంతసమయం అందుకు అయ్యే ఖర్చును సామాన్యుడు భరించడం చేతకాక మధ్యలోనే వైదొలుగుతున్నారన్నారు. దీంతో ఇలాంటి కేసుల్లో తప్పు ప్రభుత్వం వైపున ఉన్నా ప్రభుత్వానిదే విజయం వరిస్తోందన్నారు. దీంతో సామాన్యుడు చాలా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రైవేటు కేసులు విచారణకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లే ప్రభుత్వ కేసులను విచారించడానికి వీలుగా ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వాజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు.
కోర్టుల్లో అందని న్యాయం
Published Thu, Nov 13 2014 2:06 AM | Last Updated on Tue, Aug 21 2018 11:54 AM
Advertisement
Advertisement