లోకాయుక్తకు ‘గవర్నర్’ ఫోన్
అవినీతి ఆరోపణలపై లోకాయుక్త
న్యాయమూర్తికి ఫోన్ చేసిన గవర్నర్
పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
బెంగళూరు: లోకాయుక్త సంస్థ పేరును అడ్డుపెట్టుకొని లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ వస్తున్న ఆరోపణలపై గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా(వి.ఆర్.వాలా) స్పందించారు. ఈ మొ త్తం వ్యవహారంపై లోకాయుక్త భాస్కర్‌రావుతో గవర్నర్ వి. ఆర్.వాలా సోమవారమిక్కడ ఫోన్‌లో సంభాషించినట్లు సమాచారం. లోకాయుక్త వ్యవహారంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న గవర్నర్ వి.ఆర్.వాలా, లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఉధృతమవుతుండడంతో ఈ అంశంపై గవర్నర్ స్పందించారు. లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలతోపాటు ఎలాంటి ఫిర్యాదులు తీసుకోవద్దంటూ లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్త అధికారులకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం గవర్నర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సైతం గవర్నర్ ఒకింత అసహనాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. లోకాయుక్త న్యాయమూర్తి పైనే అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇదిలాగే కొనసాగితే ప్రజలు ఏ దర్యాప్తు సంస్థను కూడా నమ్మే పరిస్థితి ఉండదని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. లోకాయుక్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీని గవర్నర్ వి.ఆర్.వాలా ఆదేశించినట్లు సమాచారం.
4.