‘అశ్విన్‌రావు’ అరెస్ట్ | "Ashwin Rao 'arrest | Sakshi
Sakshi News home page

‘అశ్విన్‌రావు’ అరెస్ట్

Published Tue, Jul 28 2015 2:22 AM | Last Updated on Sat, Mar 9 2019 3:50 PM

"Ashwin Rao 'arrest

 హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన  ఎస్‌ఐటీ అధికారులు
 నేడు లోకాయుక్త పదవికి ‘భాస్కర్‌రావు’ రాజీనామా!
 
బెంగళూరు: ‘లోకాయుక్త’ అవినీతికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు కుమారుడు అశ్విన్‌రావును ప్రత్యేక విచారణ బృందం(ఎస్‌ఐటీ) అధికారులు  అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో అశ్విన్‌రావును అరెస్ట్ చేసిన ఎస్‌ఐటీ అధికారులు ఆయన్ను బెంగళూరు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అశ్విన్‌రావును లోకాయుక్త ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి అనుమతి కోరనున్నట్లు ఎస్‌ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అశ్విన్‌రావుతో  పాటు మరో వ్యక్తిని సైతం ఎస్‌ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరిస్తున్నారు. ఓ లోకాయుక్త న్యాయమూర్తి కుమారుడిని అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయడం లోకాయుక్త చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం గమనార్హం.  కాగా, లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్‌ఐటీ అధికారులు అశ్విన్‌రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు అశ్విన్‌రావు స్పందించకపోవడంతో కేసులో తదుపరి విచారణకు గాను ఎస్‌ఐటీ అధికారులు అశ్విన్‌రావును అరెస్ట్ చేశారు. ఇక ఇదే సందర్భంలో అశ్విన్‌రావు అరెస్ట్ నేపథ్యంలో లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు నేడు(మంగళవారం) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

లోకాయుక్త సంస్థ పై అవినీతి ఆరోపణలు రావడం, ఈ అంశంలో స్వయంగా లోకాయుక్త న్యాయమూర్తి కుమారుడు అశ్విన్‌రావే భాగస్వామి అయ్యారనే వార్తలు వచ్చినప్పటి నుంచి భాస్కర్‌రావు రాజీనామా కోసం డిమాండ్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకు సిద్ధపడలేదు. ఇక అశ్విన్‌రావును ఎస్‌ఐటీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్‌రావు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో గవర్నర్ వజుభాయ్ వాలాను మంగళవారం కలిసి లోకాయుక్త భాస్కర్‌రావు తన రాజీనామాను అందజేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అశ్విన్‌రావు అరెస్టుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. అశ్విన్‌రావు తనను బెదిరిస్తున్నట్లు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చెన్నబసప్ప గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే అశ్విన్‌రావును అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

 రియాజ్‌కు 12 రోజుల జుడీషియల్ కస్టడీ
 ఇక లోకాయుక్త అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త ప్రజా సంబంధాల శాఖ అధికారి రియాజ్‌ను ఆదివారం రాత్రి పొద్దు పోయాక అరెస్ట్ చేసిన ఎస్‌ఐటీ అధికారులు ఆయన్ను సోమవారమిక్కడి లోకాయుక్త ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా రియాజ్‌ను 12 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement