అక్రమార్కులను కాపాడుతున్నారా?
సిద్ధు సర్కార్‌కు గవర్నర్ లేఖ
బెంగళూరు :అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా విధానం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా గరం అయ్యారు. అనేక అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారణ చేయడానికి లోకాయుక్తకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ‘ప్రభుత్వ తీరు అక్రమార్కులను రక్షించేలా ఉన్నట్లు భావించాలా?’ అంటూ ఘాటు వాఖ్యలతో మూడు పేజీల లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కార్‌కు రాశారు. వివరాలు... అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం, ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ ధనాన్ని స్వప్రయోజనానికి వాడుకోవడం, లంచాలు తీసుకోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారించడానికి, వారిపై ఛార్జ్‌షీట్ వేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకాయుక్త ఎన్నోసార్లు లేఖ రాసింది. అక్రమాలు రుజువైన కొంతమంది అధికారులను విధుల నుంచి తొలగించాల్సిందిగా సిఫార్సు కూడా చేసింది.
ఇప్పటి వరకూ 107 కేసుల్లో ఇలాంటి సూచనలు చేస్తూ లోకాయుక్త ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించింది. నిబంధనల ప్రకారం లోకాయుక్త సిఫార్సులను మూడు నెలల్లోపు అమలు చేయాలని అలా కాని పక్షంలో అందుకు గల కారణాలను తెలియజేయాలని గతంలో సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్ని కేసులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొన్ని కేసుల్లో మంత్రి మండలిలో చర్చించి లోకాయుక్త సిఫార్సులను సిద్ధరామయ్య ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ విషయాలన్నింటి పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకాయుక్త సిఫార్సుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణికి కారణం ఏంటని ప్రశ్నిస్తూ గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ప్రభుత్వానికి లేఖ రాశారు. సిఫార్సులను అమలు చేయకపోవడానికి గల కారణాలతో వారంలోపు తనకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.
అన్నదాతల బలవన్మరణాల విషయం కూడా...
రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బలవన్మరణాల విషయాన్ని కూడా వజుభాయ్ రుడాభాయ్ వాలా తన లేఖలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతుల బలవన్మరణాలకు గల కారణాలు, ఇప్పటి వరకూ ప్రభుత్వం రైతులకు అందించిన పరిహారం తదితర విషయాలను కూడా నివేదికలో పొందుపరిచాలని గవర్నర్ వజుభాయ్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు లోకాయుక్త సిఫర్సుల అమలు విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ కొంతమంది ప్రజా హక్కుల కార్యకర్తలు హై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ విషయమై ఈనెల 22లోపు సమాధానం ఇవ్వాల్సిందిగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.