సంతకం చేయొద్దు
బెంగళూరు : శాసనసభలో ఆమోదం పొందినప్పటికీృబహత్ బెంగళూరు మహానగర పాలికె విభజనకు సంబంధించిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదేనని, అందువల్ల ఆ బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయవద్దని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను బీజేపీ, జేడీఎస్ నేతలు కోరారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఇరు పార్టీ నాయకులు వేర్వేరుగా గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. భేటీ అనంతరం మీడియాతో శాసనసభ విపక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘బీబీఎంపీ విభజన విషయమై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైనా.. ఇంకా బుద్ధి రావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు విభజన పేరుతో కాలయాపన చేస్తున్నారు.
విభజన విషయమై బి.ఎస్.పాటిల్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టలేదు. ప్రజల అవగాహన కోసం ఈ నివేదికను బహిరంగ పరచలేదు. అందువల్ల విభజన విషయమై ప్రభుత్వమే రూపొందించిన ముసాయిదా బిల్లు శాసనసభలో అనుమతిపొందడం రాజ్యాంగ విరుద్ధం.’ అని అన్నారు. ఇదే సందర్భంలో శాసనమండలి విపక్షనేత ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘శాసనమండలిలో కర్ణాటక నగర పాలికె విభజన-15 ముసాయిదా బిల్లు తిరస్కరణకు గురైన స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుని మండలి సభ్యులు ‘ముసాయిదా బిల్లు’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే మండలి సభ్యుల వ్యవహారం నచ్చలేదని స్పీకర్ పేర్కొనడం హాస్యాస్పదం. ఈ విషయాన్ని మండలిలో ప్రస్తావిస్తా’ అని అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు ఆర్.అశోక్, వీ.సోమణ్ణ, విశ్వనాథ్, రఘు తదితరులు ఉన్నారు.
రాజీవ్ ఆశయాలను తుంగలో తొక్కి : కుమార
బీబీఎంపీని విభజన చేసి తీరాల్సిందేనన్న అధికార కాంగ్రెస్ వైఖరి దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాలను మంట గల్పినట్లుగా ఉందని జేడీఎల్సీ నేత కుమారస్వామి అన్నారు. బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లుపై సంతకం చేయకూడదంటూ గవర్నర్‌ను కుమారస్వామి నేృతత్వంలో జేడీఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు బలం చేకూర్చేలా రాజీవ్‌గాంధీ అధికార కేంద్రీకరణను ఎంతో కష్టపడి అమల్లోకి తీసుకువచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అయితే రాజకీయ లబ్ధికోసం స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు వ్యతిరేకిస్తున్నా బీబీఎంపీని ముక్కలు చేయాలని సిద్ధు సర్కార్ ప్రయత్నిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు భవిష్యత్‌లో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ విన్నపం పట్ల గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సానుకూలంగా స్పందించారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జేడీఎస్ నాయకులు బసవరాజ్ హొరట్టి, చలువరాయస్వామి తదితరులు ఉన్నారు.