అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు
బెంగళూరు : శాసనసభలో నిబంధనలు అతిక్రమిస్తూ సమస్యలపై చర్చలు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించే శాసనసభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ కాగోడు తిమ్మప్ప హెచ్చరించారు. రేపటి (సోమవారం) నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో విధాన సౌధలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు చట్టసభలు ఏర్పాటయ్యాయన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే చట్టసభల్లో ఆర్కావతి డీ నోటిఫికేషన్, చెరుకు రైతుల సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే శాసనసభలు జరిగే 10 రోజులూ వాటి పైనే చర్చజరగాలని చూడటం సరికాదన్నారు.
ఈ దిశగా ఆలోచించి అనవసర చర్చకు మొగ్గుచూపుతూ విలువైన సభాసమయాన్ని హరించడానికి ప్రయత్నించే సభ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానన్నారు. మొదటి రోజున గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఉభయ సభలను ఉద్దేశించి హిందిలో ప్రసంగించనున్నారని తెలిపారు. తమకు వచ్చిన భాషలో చట్టసభల్లో ప్రసంగించడానికి అవకాశం ఉందన్నారు. కర్ణాటక విద్యా హక్కు చట్టానికి తీసుకువచ్చే మార్పులో కూడిన ముసాయిదా బిల్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై రూపొందించిన ముసాయిదా బిల్లు తదితర విషయాలకు చట్టసభల్లో అనుమతి లభించే అవకాశం ఉందన్నారు.
ప్రత్యేక చానల్ : చట్టసభల ప్రసారం కోసం ప్రత్యేక చానల్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి సూచన అందిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇక చానల్ ప్రారంభించే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పేపర్‌లెస్ చట్టసభల నిర్వహణ కోసం కృషి చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.