ఏమిటీ సమావేశాలు..?
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసంతృప్తి
బెంగళూరు : బెళగావిలోని సువర్ణసౌధలో 10 రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఎంత మాత్రం సంతృప్తికరంగా సాగలేదని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారమిక్కడ సువర్ణసౌధ ఆవరణలో కాగోడు తిమ్మప్ప విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజా సమస్యల పట్ల ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిన శాసన సభ్యులు కేవలం నిరసనలతోనే సమయాన్ని గడిపేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాలు కేవలం ఉత్తర కర్ణాటక ప్రాంత సమస్యలను చర్చించేందుకు ఏర్పాటు కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకే సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అయినప్పటికీ ఆ ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై చర్చించేందుకు గాను రెండు రోజుల సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు కాకుండా ఇతర అంశాలపైనే ఎక్కువగానే చర్చ జరిగిందని, దీంతో ముఖ్యమైన ప్రజా సమస్యలు కూడా చర్చకు దూరంగానే ఉండిపోయాయని అన్నారు. రానున్న ఏడాది నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలు బెంగళూరులో నిర్వహించాలా లేక బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించాలా అన్న విషయాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేస్తున్నట్లు స్పీకర్ కాగోడు తిమ్మప్ప వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాలు వ్యర్థం
ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చకు వేదిక కావాల్సిన అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వ్యర్థమయ్యాయని జేడీఎస్ పార్టీ నేత వైఎస్‌వీ దత్త పేర్కొన్నారు. శనివారమిక్కడ సువర్ణసౌధ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం రూపొం దించుకున్న అజెండాలతో సమావేశాల్లో నిరసనలకు దిగడంతో ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అన్నారు.