సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment