మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం, దామోదర, సీతక్క వెల్లడి
96.9 శాతం కచ్చితత్వంతో.. 50 రోజుల్లో సమగ్ర సర్వే నిర్వహించాం
4న కేబినెట్‌కు సర్వే నివేదిక అందజేత
మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ అయి చర్చిస్తుంది
అదేరోజు∙అసెంబ్లీలో నివేదిక అని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 4న ఈ సర్వే నివేదికను రాష్ట్ర కేబినెట్‌కు అందిస్తామని, ఆ రోజున ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ అయి నివేదికపై చర్చిస్తుందని వెల్లడించారు. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో నివేదికపై చర్చిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌తోపాటు కో–చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ఆదివారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
దేశంలో ఎక్కడా లేనంత కచ్చితంగా..
రాష్ట్ర ప్రభుత్వం యాభై రోజుల్లోనే 96.9 శాతం కచ్చితత్వంతో సమగ్ర సర్వే నిర్వహించి రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా ఇంతటి కచ్చితత్వంతో సర్వే జరగలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు ఈ సర్వే చేపట్టామని తెలిపారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేకు సంబంధించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఆదివారం మంత్రివర్గ ఉపసంఘానికి సర్వే నివేదిక సమర్పించారని వెల్లడించారు.
సంక్షేమ కార్యక్రమాల కోసం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలను వినియోగించుకుంటామని తెలిపారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక న్యాయ విప్లవమని వ్యాఖ్యానించారు. సర్వేపై తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్‌లు వేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి అధికారి, సిబ్బందికి మంత్రివర్గ ఉపసంఘం అభినందనలు తెలుపుతోందన్నారు.
రాష్ట్ర చరిత్రలో మైలురాయి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రదర్శిస్తూ సర్వేలో పాలు పంచుకున్నారని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమని మంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపు అసెంబ్లీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ భేటీ జరుగుతోందని పేర్కొంటూ.. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment