సభ్యులు మాట్లాడేది ఎవరు రాసుకుంటున్నారు
కూన రవికుమార్ ఆవేదన
నిండు సభలో అసత్యాలు వద్దు: స్పీకర్ అయ్యన్న
అసెంబ్లీ జీరో అవర్‌లో వేడెక్కిన చర్చ
సాక్షి, అమరావతి: ‘జీరో అవర్.. డ్రైవర్‌లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్‌కు హితవు పలికారు.
కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి
అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ ఎమ్మెల్యే
ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్
ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్ పోలీసులుగా కన్వర్షన్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి.
– పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం
తుంగభద్ర 33 గేట్లు మార్చాలి
75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి. – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే
లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి
విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి. – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment